కర్మ సిద్ధాంతం & పరిహారాలురహరలు
ఉపోద్ఘాతం
జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిష్యులు చెప్పే పరిహారాలతో మనం నిజంగా ఆ సమస్య నుంచి బయట పడతామా, నిజంగా పరిహారాలు పనిచేస్తాయా, మనం చేసే పరిహారం సరైనదేనా, సరైన పద్ధతిలో చేస్తున్నామా, నిజంగా పరిహారాలు అవసరమా, భక్తి, దైవం జీవితాన్ని మార్చేస్తాయా. ఇలాంటి అనేక ప్రశ్నలకు జ్యోతిష్యం ద్వారా సమాధానం దొరికే అవకాశం ఉంది. ( నేను చెప్పే ప్రతి విషయం నా అనుభవం నుంచి నా పరిశీలన నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను, నేను కుల మతాలకు అతీతంగానే ఆలోచించి చెప్పే ప్రయత్నం చేస్తాను )
పద్మనాభసింహ ఇది నా ప్రపంచం (Baadshah 2013 Movie), ఇవన్నీ నాకు అర్థమైన విషయాలు మాత్రమే, నా ప్రపంచంలో మీరు తప్పులు వెతకడానికి వీల్లేదు. 🙂 😊
పరిహారాలు
తెలిసో తెలియకో చేసిన తప్పుకు చేసే ప్రాయశ్చిత్తమే పరిహారం. (అది ఈ జన్మలో అయినా, పూర్వ జన్మలో అయినా ) సమస్య ఆధారంగా గురువుల (వేదం లేక పురాణం ఆధారంగా) చేత లేక పెద్దవారి చేత ఇలాంటి పరిహారం లేదా ప్రక్రియ చేయమని మనకి సలహా ఇస్తూ ఉంటారు, నిజానికి అవి కొంతమందికి పని చేశాయని కొంతమందికి పని చేయలేదని చెప్తూ ఉంటారు దీనికి గల పూర్తి కారణాలను మనం తెలుసుకోవాలి.
పూర్వజన్మ కర్మ
హైందవ సంప్రదాయం, భారతదేశంలో చాలా మంది పూర్వజన్మను పూర్వజన్మ కర్మను కచ్చితంగా నమ్ముతారు, అనేక పురాణాల ఆధారంగా, నాకు కలిగిన అనుభవం ఆధారంగా అది నిజమే అని నమ్మాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో శాస్త్రీయమైన ఆధారాలు చూపించలేకపోవచ్చు.
నాకు తెలిసినంతవరకు జీవి అనేకసార్లు జన్మించడం మరణించడం జరుగుతుంది, ఆత్మ నశించినది, ఒక్కోసారి మనిషిగానో, జంతువు గానో, కీటకంగానో, జల చారలుగానో కర్మను అనుసరించి ఎలాగైనా పుట్టవచ్చు. ఒక జీవి ఎన్నిసార్లు జన్మిస్తుంది అనే విషయం మాత్రం నాకు కూడా పూర్తిగా తెలియదు. అయితే మళ్లీ పుట్టినప్పుడు ఈ జీవితంలో ఏమీ అనుభవించాలి అనేది పూర్వకర్మ ఆధారంగా నిర్దేశించబడుతుంది.
కర్మ సిద్ధాంతం
ఒక ముక్కలో చెప్పాలంటే ఎవరినైనా లాగిపెట్టి గట్టిగా కొడితే తిరిగి కచ్చితంగా కొడతాడు లేదంటే ఏదో ఒక రకమైన వ్యతిరేక భావనను తెలియజేస్తాడు. ఇలా వ్యక్తి తెలియజేసే వ్యతిరేక బావనే చేసిన కర్మకు ప్రతి కర్మ చేరుకోవడం. కర్మ అంటే పని అని అర్థం, ఇది మంచి చెడు ఏదైనా.
దృఢకర్మ ఒక విషయాన్ని జీవితంలో కచ్చితంగా అనుభవించాల్సింది ఉంటే అది దృఢకర్మ అంటారు.
అద్రుడకర్మ కొన్ని విషయాలు మానవ ప్రయత్నంతో మనకుగా మనం మార్చుకునే అవకాశం ఉంటే అది అద్రుడు కర్మ అవుతుంది.
కర్మ (free will) కొన్ని విషయాలు పూర్తిగా మన చేతుల్లో ఉంటాయి, ఉదాహరణకు మనం సినిమాకి వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు లేదంటే మానేయొచ్చు.
హైందవ ధర్మ పరిహారాలు & రాశి చక్రం
జ్యోతిష్యులు అందరూ రాశి చక్రం ఆధారంగానే పరిహారాలు తెలియజేస్తారు. 360 డిగ్రీల ఈ రాశి చక్రాన్ని 12 భాగాలు చేశారు, 27 నక్షత్రాలు ఈ రాశుల మీద ఒక రోడ్డు లాగా నిర్మించబడ్డాయి. రాశులు నక్షత్రాలు స్థిరమైనవి ఇది కదలవు, వీటి మీద నవగ్రహాలు సంచరిస్తూ ఉంటాయి.
జన్మ సమయంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా, కొన్ని సందర్భాల్లో జరుగుతున్న దశాబుక్తి ఆధారంగా జ్యోతిష్యులు పరిహారాల్ని సూచించే ప్రయత్నం చేస్తారు.
నాలుగు రకాల రాశులు పంచభూతాల తత్వాన్ని కలిగి ఉంటాయి.
- అగ్ని తత్వరాశి – మేషం, సింహం, ధనస్సు
- భూతత్వరాశి – వృషభం, కన్య, మకరం
- వాయు తత్వ రాశి – మిధునం, తుల, కుంభం
- జలతత్వరాశి – కర్కాటకం, వృశ్చికం, మీనం
గ్రహ శాంతి
సహజంగా గ్రహాలకు శాంతి చేయడం కోసం ఈ విధమైన ప్రక్రియను అనుసరిస్తారు.
- జపం – వాయు తత్వం
- దేవాలయ దర్శనం, దానం – భూతత్వం
- హోమం – అగ్ని తత్వం
- తర్పణం – జలతత్వం
ఉదాహరణకు శని గ్రహ శాంతికి దశ 19 సంవత్సరాలు గనుక 19,000 జపం చేసి, దానిలో 10% అంటే 1900 సార్లు శని మూల మంత్రంతో హవ్యములతో హోమం చేస్తారు, మళ్లీ దానిలో 10% అంటే 190 శనికిష్టమైన నువ్వుల ఉండలని నీటిలో జలచరాల కోసం తర్పణం చేస్తారు. ఈ హోమం స్వగృహంలో గాని దేవాలయంలో గాని ఆచరిస్తుంటారు, అన్ని అయ్యాక 19 మంది బ్రాహ్మణులకు అన్నదానం వస్త్ర రజిత ఇలా శక్తి కొద్దీ దానం చేస్తారు.
పరిహార ప్రక్రియ ఎంతవరకు సరిగ్గా జరిగిందనే దానికి రుజువు
- శని నీలం రంగుకి సూచన కావున పూజ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక మనకి నీలం రంగులో ఏదైనా గొప్పగా కనిపించవచ్చు, శని కుంటివాడు గనుక అలాంటి వ్యక్తి ఎవరైనా వచ్చి మనతో మంచిగా మాట్లాడవచ్చు, ఆ భయం ఇవ్వవచ్చు ఇలాంటి విచిత్రం ఏదైనా జరగవచ్చు.
- మరోసారి జ్యోతిష్యుణ్ణి కలిస్తే ప్రశ్న కుండలి ద్వారా ఒకటి ఐదు తొమ్మిది కోన స్థానాలను పరిశీలించి ఏమాత్రం అది గొప్పగా జరిగిందో తెలుసుకోవచ్చు.
పరిహారాలు ఒకరికి కోసం చేయడం
నాకు తెలిసినంతవరకు భార్య చేసింది భర్తకు, తల్లి చేసింది పిల్లలకు కొంతవరకు చెందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, రుణానుబంద రూపేనా ఏర్పడతారు కనుక ఎవరి కోసం ఎవరైనా చేయవచ్చు, చిన్నపిల్లల కోసం తల్లి చేయడం, ఆరోగ్యం బాగా లేనప్పుడు వారికోసం కుటుంబ సభ్యులు చేయడం సబమైన విషయం, ఎంత చేసినా కొంత శాతం మాత్రమే వెళుతుంది, కాబట్టి ఎవరిది వాళ్లే చేయడం ఉత్తమం.
ఉదాహరణకు నాకు ఆకలిగా ఉంటే వేరే వాళ్ళు తింటే నా ఆకలి తీరదు.
పరిహార ప్రక్రియ శాస్త్రీయ దృక్పథం
జపం: మానసిక నిశ్చలత, ఏకాగ్రత కలుగుతాయి. అన్ని విషయాలు నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. మంత్ర బీజాక్షరాలకు, శబ్ద శాస్త్రానికి ఉన్న శక్తి అది.
హోమం: హోమంలో వాడే హవ్యాల వలన వాటిని పీల్చి ఆరోగ్యము మెరుగుపడుతుంది.
దానం & తర్పణం: ఏది ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం వలన తెలియని మానసిక సంతృప్తి కలుగుతుంది.
దేవాలయ దర్శనం: ఇది ఒక అయస్కాంత క్షేత్రం, మానసికంగా ఆధ్యాత్మికంగా సరైన ఆలోచనలకు ప్రశాంతతకు మూల కారణమవుతుంది.
ఇలాంటి పరిహారాలు బోలెడు చేశాము, ఏది పనిచేయలేదు
ఇక్కడ మన పూర్వ పుణ్యాన్ని కిలోల్లోనూ మరి ఏ విధంగానో కొలవలేము కాబట్టి మనకు నిజానికి ఏమాత్రం అయినా పూర్వపుణ్యం ఉందో తెలియదు అది ఎంతవరకు ఇప్పుడున్న సమస్యలను గట్టిగా ఇంచేందుకు ఉపయోగపడుతుందో కూడా తెలియదు. మనం కోరుకునే విషయం మనకు మంచో చెడో కూడా తెలియదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం కోరే కోరికకు తగిన పూర్వపుణ్యం లేనప్పుడు మనకు ఈ పరిహార ప్రక్రియలు ఫలించినట్టు ఫలితం కనబడదు.
పూర్వపుణ్యాన్ని భాగ్య స్థానం నుంచి, భాగ్యాధిపతి నుంచి మరియు దశ నాదుడు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడో పరిశీలించాలి.
పూర్వ పుణ్యము ఎలా పెంచుకోవాలి ఎలా వస్తుంది
పూర్వ పుణ్యం అనేది ఎక్కడినుంచో గాల్లో వచ్చింది కాదు, పూర్వజన్మ యందు మన కష్టాన్ని మనం పూర్తిగా వాడుకోకుండా మిగిలించి ఉన్నది.
నేనొక రెండు నెలలు ఉద్యోగం చేసి ఒక లక్ష దాసాను. వేసవి సెలవుకి కులుమనాలి విహారయాత్రకు వెళ్లాను. అప్పుడు నేను ఈ దాచిన డబ్బులను వాడుతున్నాను. అంటే ఇక్కడ దాచాను కాబట్టి వాటిని వాడుకోవడానికి వెసులుబాటు ఉంది, లేకపోతే అక్కడే సంపాదించి అక్కడే వాడుకోవాల్సి ఉంటుంది, అది అంత సులభమైన మార్గం కాదు.
మనకు డబ్బులు ఉంటే 🏧, UPI, cheque, బ్యాంకుకు వెళ్లి ఇలా ఏదో ఒక మార్గం ద్వారా మన డబ్బులు తిరిగి పొందుతాం, ప్రయాణంలో కావలసినంత డబ్బులు మాత్రమే ఉంచుకొని మిగిలినవి బ్యాంకులో దాస్తాము.
ఇక్కడ డబ్బులు అంటే మన శక్తిని, కష్టాన్ని తర్జుమా చేస్తే వచ్చిన రూపం అంతే.
మనకు నిజానికి గత జన్మ స్మృతి అనేది ఉండదు.
దేవుడు ఒక పెద్ద లెక్క ఉన్నోడు
ఈ జీవితంలో చేసిన కష్టాన్ని మనం డబ్బు రూపంలో దాచుకుంటున్నాం.
మనకి తెలియని జన్మజన్మల కష్టాన్ని పూర్వపుణ్యంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు అందరికీ అర్థం అయిపోయింది కదా పూర్వపుణ్యమంటే గాల్లోంచి వచ్చింది కాదు అది కూడా మన కష్టమే. కాకపోతే అది జన్మంతరంగా మనకు తెలియకుండా మనం పొందుతున్నాం.
దేవుడి నెట్వర్క్ – పంచభూతాలు
మన పూర్వ పుణ్యాలను పాపాలను ఆ దేవుడు దాచి పెడుతున్నాడు అనుకున్నాం. ఈ అన్ని లెక్కలను దాస్తున్నాడు కాబట్టి కొంచెం సేపు ఆయనను ఒక బ్యాంక్ అధికారి అనుకుందాం.
మరి చాలామంది చాలా పనులు చేసుకుంటారు కదా, మనం చేసేది పాపం అని ఎలా తెలుస్తుంది అంటే, ఆయనకంటూ సొంత నెట్వర్క్ ఉంది. అవి పంచభూతాలు, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి.
ఈ ఐదు పంచభూతాలకు తెలియకుండా ఏ జీవి ఏమి చేయలేడు, ఒకవేళ చేశాడు అంటే వాడు ఈ లోకంలో లేనట్టే.
ఉదాహరణకు ఓ పిల్లోడు బాగా దాహంగా ఉంది అని మంచినీళ్లు తాగుతుంటే నువ్వు గబాలున లాక్కుని వాడికి మిగిల్చకుండా తాగేసేవనుకో అది ఒక చిన్న తప్పు. ఇప్పుడు నీరు అనే పంచభూతం వెళ్లి దేవుడికి ఒక పెద్ద డాటా బేస్ లో అప్డేట్ చేస్తది.
నేటికి సంబంధించిన రెండు గ్రహాలు చంద్ర శుక్రులు రాబోయే జన్మలో ఈ విషయాన్ని తిరిగి అనుభవించే విధంగా ఈ రిపోర్ట్ ఆధారంగా ఆగ్రహ స్థితిలో మనం పుట్టేటట్టు పరిస్థితి ఏర్పడుతుంది.
జీవి చేసే మంచి చెడు పనులు
దేవుడి దగ్గర మంచి చెడుకి రెండు వేరువేరుగా Database ఉన్నాయి, మంచి చేస్తే మంచి లోను చెడు చేస్తే చెడులోనూ ఈ రిపోర్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి తిరిగి ప్రతి జీవి కర్మ ఆధారంగా మంచి చెడును కచ్చితంగా అనుభవించాలి. మొత్తంగా జీవితాన్ని చూసుకుంటే మంచి ఎక్కువగా ఉంటే అంతా బాగున్నట్టు మనం అర్థంచేసుకోవాలి అంతే.
పరిహారాలు, పూజలు, భక్తి దేవుడు
మనం చేసే ఏ పరిహారాలు పూజలు దేవుని ఆనందింప చేయవు, బాధ పెట్టవు, మనం అనుకునే వీటన్నిటికీ ఆయన చాలా అతీతుడు.
మరి ఎందుకు ఈ పరిహారాలు చేయడం అంటే, ఉదాహరణకు మీ కష్టానికి తగిన డబ్బులు ఒక బ్యాంకులో దాసుకున్నారు, మీకు కలిగిన ఒక చిన్న అవసరానికి మొబైల్ యాప్ ద్వారా నగదు చెల్లించారు ఇది చాలా సునాయాసమైన మార్గం.
ఒకవేళ మీ అవసరం పెద్దగా ఉంటే దాన్ని కొనడానికి ఒక చెక్కు ద్వారా బ్యాంకులో డబ్బులు తిరిగి పొందవలసి వస్తుంది మళ్ళీ బ్యాంకు వెళ్లాల్సి వస్తుంది.
ఒక్కోసారి మీ డబ్బు ఒక లారీ తో తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తే, మీరు ఆ బ్యాంకు యొక్క ముఖ్య బ్రాంచ్ కి వెళ్లాల్సి ఉంటుంది.
ఎటువంటి పూజలు పరిహారాలు చేయని వారికి మంచి జీవితం లభిస్తుంది కదా, ఎంత చేసినా ఫలితాలు ఎందుకు కలగవు
ఒక్కోసారి మీ చిన్న అవసరానికి కూడా, మీ అకౌంటు లాక్ అయిపోయినా, సస్పెండ్ అయిపోయిన, బ్యాంకుకు వెళ్లి దాన్ని సరి చేయాల్సింది ఉంటుంది.
మీరు మీ ఖాతాను సరిగా ఉంచుకున్న, మీ నగదు బ్యాంకులో లేకపోతే ఎంత గొప్ప బ్యాంక్ అయినా మీరు డబ్బులు తీసుకోలేరు.
ఇప్పుడు దేవుడు విషయానికొద్దాం, మీరు ఒక చిన్న కోరికను ( ఒక మంచి ఆపిల్ తినాలని అనుకున్నారు ) ఈ విషయం చాలా సునాయాసంగా నెరవేరుతుంది. దీనికోసం మనం ఎన్నడు దేవుని తలుచుకోము, ఎందుకంటే ఇది మన చేతుల్లోనే ఉంది అని.
ఒక ఇల్లు, కారో కొనాలనుకున్నప్పుడు, సామాన్య వ్యక్తికి ఇది కొంచెం పెద్ద విషయం అప్పుడు బ్యాంకు కు వెళ్లడం అంటే, ఒక పెద్ద పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఏ అడ్డంకులు రాకుండా చూసుకోమని చెప్పడం. మన పూర్వ పుణ్యముంటే అనుగ్రహం దొరుకుతుంది.
ఒక్కోసారి చిన్న పనులు కూడా జీవితంలో ముందుకు వెళ్లవు, అప్పుడు మనం గ్రహ శాంతులు, కులదైవం, జప తప, హోమ, తర్పణ, క్షేత్ర దర్శనం వంటివి ఆచరించి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పూర్వ పుణ్యం ఉంటే అవి ఫలించవచ్చు.
గ్రహాలు – బ్యాంకు సెక్యూరిటీ గార్డ్
ఒక్కోసారి నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది మనం చేసే పూజలన్నీ గ్రహాలకి లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని ?
ఉదాహరణకు ఒక పెద్ద బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ కి ఆయనకు నచ్చినవన్నీ చేసి, ఆయన సంతోషపెట్టి, మనకు నచ్చినంత నగదు ఆ బ్యాంకులో నుంచి తెచ్చుకోవచ్చా ?
అలాగే ఒక గ్రహం అంటే మంత్ర స్వరూపం, మనం చేసిన కర్మ ఆధారంగా మన జీవితంలో ఏది ఎలా అనుభవించాలో నిర్దేశించడమే తన పని అయితే, మనము తిరిగి ఉపశమనం పేరుతో దాని పని అది చేయకుండా అంతరాయం వేస్తున్నామా ?
ఏ దేవుడికైనా, యే గ్రహానికైనా, పూజ, పరిహారం, వ్రతం ఏది చేసినా నీకు పూర్వ పుణ్యము ఉంటే అది జరుగుతుంది, ఈ పద్ధతులన్నీ నీ పూర్వపుణ్యాన్ని వాడుకోవడానికి ఉన్న మార్గాలు అని గ్రహించాలి.
పరిహారాలు – ఔషధం – అలవాటు
ఏదైనా ఒక విషయానికి పరిహారం, ప్రాయశ్చిత్తం, చేస్తున్నవంటేనే మళ్లీ తిరిగి అలాంటి తప్పు జీవితంలో చేయకూడదు.
పరిహారం అంటే సమస్య వచ్చినప్పుడు మందులు వాడి వదిలేసినట్టు వదిలేసే విషయం కాదని గుర్తు పెట్టుకోవాలి.
గ్రహ దోషాలు, జీవితంలోని పరిస్థితులు రావడానికి ఎవరు కారణం కాదు, స్వయంగా మనమే కారణం, జాతక చక్రం అనేది ఒక కారు నడుపుతున్నప్పుడు ఒక స్పీడోమీటర్ లాంటిది మాత్రమే, స్పీడోమీటర్ స్పీడ్ చూపించకపోయినా కారు తన సామర్థ్యాన్ని చూపించగలరు.
అలాగే ప్రతి జీవి కర్మ ఆధారంగా తిరిగి మంచైనా చెడు అయినా అనుభవించవలసి వస్తుంది, కాబట్టి సత్కర్మను అభివృద్ధి చేసుకోవాలి.
పరిహారం అనేది ఒక అలవాటు అవ్వాలి, అంటే సత్ కర్మ అనేది అలవాటు అవ్వాలి, అంతేగాని సమస్య వచ్చినప్పుడు హోమం చేస్తాను, 10 మందికి దానం చేస్తాను అంటే సరైన పద్ధతి కాదు.
కాలం తిరిగి రానిది
ప్రతి వ్యక్తి తన గుర్తింపు తను చేసే పని వల్లే వస్తుంది, అదే దశమ కర్మ స్థానం, కాబట్టి తను చేసే పని తన చేతిలో ఉన్న పని కచ్చితంగా తన శక్తి కొద్దీ పూర్తిగా చేయవలసింది.
ఎందుకంటే ఒక సందర్భంలో చేసిన ఒక విషయాన్ని తిరిగి మార్చడానికి కాలంలో వెనక్కి ప్రయాణించలేం కనుక, చేసేటప్పుడే సరిగా చేస్తే జీవితంలో ఆ విషయం పట్ల ఎటువంటి విచారం మళ్లీ కలగదు.
ఉదాహరణకు 24 సినిమా లాగా మనం ఏది వెళ్లి గతంలో మార్చలేము, టైం మిషన్ లో ట్రావెల్ చేయలేం.
సంస్కృతి – శోడశోపచార పూజలు
ముఖ్యంగా మనం చేసే శోడశోపచార పూజలలో మనం చేసేది, దేవుని ముందుగా రమ్మని, ఆసనం మీద కూర్చొని, మంత్ర జపంతో భక్తితో ఆరాధించి, కాళ్లు చేతులు మొహం అన్ని శుభ్రం చేసుకోమని, తరువాత ప్రసాదం తినమని, తర్వాత మళ్లీ కాళ్లు చేతులు మొహం కడుక్కోమని, తాంబూలం తీసుకోమని, తిరిగి యధా స్థానానికి చేరుకోమని శాస్త్రోక్తంగా సాగనంపుతాం.
ఇక్కడినుంచి ఇతర జీవి పట్ల, తల్లిదండ్రులకు గాని, సేవ అనేది జీవితంలో ఉండే అలవాటుగా తెలియజేస్తుంది.
సరస్వతి లక్ష్మీపార్వతి
బ్రహ్మ జీవులను పుట్టిస్తే, మనిషి పుట్టాక మనుగడకు ఏదో ఒక విద్యను నేర్చుకోవాలి.
మహావిష్ణువు పోషణ కారకుడు అయితే, ప్రతి జీవి పొట్టకూటికోసం కష్టపడాలి, తినగా మిగిలిన కష్టాన్ని మనం డబ్బు రూపంలో దాసుకుంటున్న అదే శ్రీ మహాలక్ష్మి.
కష్టంతోనే మనం ఆహారాన్ని పొందుతున్నమ్ అదే అన్నపూర్ణ అనుగ్రహం, చివరికి శివైక్యం చెందుతున్నమ్.
ఒక్కోసారి విషయం అనుభవపూర్వకంగా అవగాహనకు వస్తూ ఉంటుంది.
Master CVV : Split కర్మ
మాస్టర్ సి.వి.వి గారు శివ స్వరూపంగా, సాక్షాత్తు దైవ స్వరూపంగా పరిగణిస్తారు, ఇక్కడ మనం ఆయన చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే చాలు.
ఒక వ్యక్తి జాతకంలో తల్లికి ఆరోగ్యం బాగోదు జాతకుడు ఆ కర్మను అనుభవించవలసి ఉంది అని మీరు పరిశీలించారు.
ఇక్కడ తల్లి అంటే ఆ జాతకుడు యొక్క సొంత తల్లి అయినా, మరి ఏ తల్లి అయినా తల్లితో సమానమే. కాబట్టి జాతకుడు తల్లి సమానురాలు ఎవరికైనా తన సేవను అర్పించవచ్చు.
ఉదాహరణకు శని ఆదివారాల్లో సమయం దొరికినప్పుడల్లా వృద్ధాశ్రమానికి వెళ్లి మన శక్తి కొద్దీ తల్లి సమానురాలకి సేవ చేస్తూ ఉండవచ్చు.
ఇలా చేస్తే కర్మ ప్రకారం పెద్దగా జరగాల్సిన విషయం చిన్నగా జరగొచ్చు. ( గొడ్డలితో పోయేది గోటితో పోవచ్చు ). జ్యోతిష్యం ఎప్పుడు పూర్తిస్థాయిలో సాంద్రతను నిర్ధారించదు.
ఉదాహరణ : తేలు కుట్టిన బ్రాహ్మణుడు, బంగారు నాణెం దొరికిన కొడుకు.
ఆశించి చేసే పరిహారాలు
వ్యాపారం లాగా చేసే పరిహారాలు ఏవి పనిచేయవు, నేను వంద రూపాయలు పెట్టాను కాబట్టి 20 రూపాయల లాభం కావాలి, లక్ష రూపాయలు పెట్టి హోమం చేశాను కాబట్టి నేను అనుకున్న పని కచ్చితంగా అయిపోవాలి ఇలాంటివి ఎన్నడు జరగవు. కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి.
గురువుల చేత పరిహారాలు
మనకున్న పూర్వకర్మ ఆధారంగా కొంతమంది జీవితాల్లో కొన్ని సందర్భాల్లో విశేషమైన సిద్ధులు గురువులు వంటి వారు తారసపడుతుంటారు, వాళ్ళు చెప్పింది చిన్న విషయమైనా అది తారక మంత్రం లాంటిది. అంతే గౌరవంతో దాన్ని పాటిస్తే ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూంటుంది. ఇదంతా ఆ మహానుభావుల యొక్క అనుగ్రహం.
కొన్ని సందర్భాల్లో కొంతమంది వారి స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని ఆశీర్వదించిన, మీరు గురు భావనతో వారు చెప్పింది ఆచరిస్తే మీ పూర్వపుణ్యం బాగుంటే అప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి.
ఉదాహరణకు ఒక గురువుగారు 16 రోజులు 16 ప్లేట్ ఇడ్లీలు 16 మందికి పంచమని ఒక పరిహారం చెప్పారనుకోండి, అది పాటించిన వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఉండవచ్చు, ఎందుకంటే అది గురువు వాక్కు, ఒకవేళ ఆ జాతకుడు తన శక్తిని మంచిగా వాడిన దాని ప్రభావం గురువు మీద ఉంటుంది.
అందుకే గురువులు ఎవరికి పడితే వారికి ఏది పడితే అది ఉపదేశాలు పరిహారాలు చెప్పరు, దేనికైనా ఒక అర్హత కూడా ఉండవలసి వస్తుంది.
లైఫ్ స్టైల్ పరిహారాలు
మనం అనుకున్నట్టుగానే మనిషి సంఘజీవి గనుక మనుషులతోనే బతుకుతాడు కనుక, పరిహారం అనేది ఒక ఔషధం లాగా కాకుండా ఒక అలవాటుగా మారిపోవాలి అదే సరైన మార్గం అని నమ్ముతాను.
కర్మ వల్ల ఫలితం వస్తుంది గాని గ్రహాల వల్ల మరో ఇతర శక్తుల వల్ల రావడం లేదు, అంటే మనం సత్కర్మలు చేయాలని అర్థం చేసుకోవాలి, వ్యక్తిగా పురోగతిని సాధించాలి, ఆశించి ఏది చేసినా అది వ్యర్థం.
పంచభూతాలు – కాలం
కనిపించేవి పంచభూతాలైతే, కనిపించనిదే కాలం, అది విలువైనది. ఏ విధంగా వృధా చేసిన, సరైన విధంగా వాడుకోకపోయినా మనం చేసే దాన్ని బట్టి దాని తీవ్రత ప్రకృతి తిరిగి మనకు ఇస్తూ ఉంటుంది.
ఒక జాతక చక్రంలో లైఫ్ స్టైల్ రెమిడి
ప్రతి వ్యక్తి తన జీవితంలో 12 భావాల యొక్క సౌఖ్యం పొందాలనుకుంటాడు, ఏ భావం అయితే బాగుండదు. ఆ భావానికి సంబంధించిన సమస్యను ఎదుర్కొంటాడు, అదేంటో తెలుసుకుని దాన్నే సేవగా మార్చుకోవాలి.
పంచభూతాల్లో ఏది పాడయిందో చూసి, అది దేనివల్ల జరిగింది అని పరిశీలించి, ఆ తప్పును పునరావృతం కాకుండా చూసుకొని, దానికి సంబంధించిన సత్కర్మలు చేసుకోవాలి.
కర్మను అర్థం చేసుకొని , లైఫ్ స్టైల్ పరిహారాలు ఎలా చెప్పాలి అనే దాని మీద నేను 100 వీడియోలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఉదాహరణకు చతుర్ధ భావము, అధిపతి, మాతృ కారకుడు చంద్రుడు, జల రాశుల్లో పాప గ్రహాల చేత ఏర్పడిన బలహీనమైన గ్రహస్థితి ఉన్నప్పుడు, స్త్రీలను, తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి, వారికి సంబంధించి సేవను చేయవలసి ఉంటుంది, అలాగే నీటిని వృధా చేయకూడదు, లేనివారికి అవకాశం కొద్దిగా సహాయం చేయవచ్చు.
ముగింపు
మనిషి సంఘజీవి, మనుషులతోనే బతుకుతుంటాడు, కాబట్టి మానవత్వాన్ని మర్చిపోకూడదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, ఏ వ్యక్తి అయినా ఎప్పుడో అప్పుడు ఉపయోగపడతాడని, మనం మనిషిగా ముందుకెళ్లడానికి ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు సహాయం లేకుండా ముందుకు వెళ్ళలేకుండా ఉంటాం, వారి యందు కృతజ్ఞతలు మర్చిపోకూడదు, ప్రకృతిలో మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది, మంచి ఇస్తే వస్తుంది చెడిస్తే చెడు తిరిగి వస్తుంది, మనం ఏ పరిహారం చేసిన అది ఇతర జీవికి ఎలా ఉపయోగపడుతుందో కూడా చూడాలి, ప్రకృతిని పంచభూతాల్ని రక్షించాలి, ఎప్పుడు దీన్ని ఉన్నది కదా అని దుర్వినియోగం చేయకూడదు.