ఉపోద్ఘాతం :
కాలం ( భూత, భవిష్యత్తు, వర్తమానాలు) గురించి తెలుసుకోవడానికి ప్రపంచంలో ఉన్న ఏకైక మార్గం జ్యోతిష్యం.
ప్రపంచంలో ఒక్కో విషయం ఒక్కొక్కరిని అబ్బురపరుస్తుంది, అలాంటి వాటిలో నాకు జ్యోతిష్యం ఒకటి.
ఏదైనా ఒక దాని గురించి ఊహించడానికి, దానికి సంబంధించిన గతంలో జరిగిన కొంత సమాచారం కావాలి. కానీ అలాంటిది ఏదీ తీసుకోకుండా కేవలం జన్మ వివరాలతో మన పూర్వ కర్మ నుంచి మొదలుకొని ప్రస్తుతము మరియు భవిష్యత్తు గురించి అంచనా వేయడం మామూలు విషయం కాదు. అది కూడా కేవలం గ్రహాలను పరిశీలించి.
మహర్షులు మనం పుట్టినప్పుడు గ్రహాలను ఒక ఫోటో తీస్తే అదే మన జన్మ జాతకం, ఎన్ని గంటలకు తీశారు ఆ సమయమే జన్మ లగ్నం, దీనినే జన్మ కుండలి అంటారు.
ప్రపంచంలో ఉన్న అన్ని జ్యోతిష్య శాస్త్రాలకు తల్లి, తండ్రి, తాత, ముత్తాత కూడా పరాశర జ్యోతిషం నా దృష్టిలో.
గ్రహాలు, భావాలు, దశలు :
జన్మ జాతక విశ్లేషణకు గ్రహాల బలం కనుక్కోవడం చాలా ముఖ్యం, జాతకంలోని 12 భావాల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలి, ఇవన్నీ కలిసి ఏ కాలం (దశ అనే పద్ధతి కాలాన్ని కనుక్కునే విధానం) పై ఎలాంటి ప్రభావం కలిగిందో తెలుసుకోవడమే జ్యోతిష్య ఫలితం.
రాశులు, నక్షత్రాలు, గ్రహాలు :
జ్యోతిష్యం నేర్చుకోవడానికి ముందుగా మూడు విషయాలు తెలియాలి.
- ఒకటి రాశులు
- రెండు నక్షత్రాలు
- మూడు గ్రహాలు
అంటే ఒక గ్రహం ఏ రాశిలో ఉంది, మరియు ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది,మరియు ఏ నక్షత్రంలో ఉంది, ఇవి మనకు అర్థం అయితే జాతక చక్ర పరిశీలన చేయవచ్చు.
ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. రాశి చక్రాన్ని భూమిగా ఊహించుకోండి, నక్షత్రాలను భూమి మీద ఉన్న రహదారుల్లాగా ఊహించుకోండి, గ్రహాలు వాటిపై ప్రయాణించే వాహనాలుగా అర్థం చేసుకోండి, భూమి మరియు రహదారులు ఎన్నడూ కథలవు, కానీ వాహనాలు ఎప్పుడు భూమిపై సంచరిస్తూనే ఉంటాయి, అలాగే రాశి చక్రం, నక్షత్రాలు స్థిరమైనవి,మరియు ఇవి ఒక ఊహ జనతమైనవి, ఈ గ్రహాలే ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. మనము జన్మ సమయం లో వాటిని ఒక ఫోటో తీసుకున్నామంటే, ఫోటోలో ఉన్న విషయాలు ఎలా కదలవో, జన్మించినప్పుడు గ్రహస్థితి ఎక్కడ ఉందో అదే ఆధారంగా చేసుకుని రకరకాల లెక్కలు వేసి జ్యోతిష్య ఫలితాలు చెప్తుంటారు.
360 డిగ్రీల రాశి చక్రం ఒక ఊహాజనితం. దీనిని 12 భాగాలుగా చేసే వాటిని 12 రాశులు అన్నారు. ఈ 12 రాశుల్లో 27 నక్షత్రాలు అమర్చారు, అంటే 30 డిగ్రీలకు ఒక రాశి, 13.20 డిగ్రీలకు ఒక నక్షత్రం అన్న మాట.
అసలు గ్రహాలు అంటే ఏమిటి? రాశులు అంటే ఏమిటి? అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు ఈ గ్రహాలు, రాశులు, నక్షత్రాలు ఉపయోగించి ఎలా తెలుసుకోవాలి అనేది జ్యోతిష్యం. ఇవన్నీ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం కనుక మనం ఒక కథ రూపంలో తెలుసుకుందాం.
గొప్ప రాజ్యం :
లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన పురాతన రాజ్యం ఇది. అది సింహ రాజ్యం, దానికి రాజు రవి, రాజుకి సరైన ఈడు జోడు గల రాణి చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. వాళ్లు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు.
రాజ్యంలోని రాజు & రాణి అందరికీ తల్లిదండ్రులు కదా, పిల్లలందరి ( రాజ్య ప్రజల ) కోసం మిధున రాశిని ఏర్పాటు చేశారు. అది వంటశాలగా నిర్ణయించి యువరాజు అయిన బుధుడును విధులు నిర్వహించమన్నారు.
మిధునం అంటే ఉత్పత్తి కేంద్రం, ఇప్పుడు వంట వండింది అందరికీ పెట్టాలి కాబట్టి, అది కూడా బుధుడే పంచుతాను అన్నాడు. దానికోసం కన్య రాశి ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ లేక అడ్వర్టైజ్మెంట్ వంటి వ్యాపారం చేస్తాడు.
పూర్వం నుండి వస్తువు అమ్మకానికి అమ్మాయిలను ప్రకటనల కోసం వాడుతున్నారు. కనుక కన్యారాశి ఒక అమ్మాయిని సూచిస్తుంది, దీనికి బుధుడు అధిపతి.
ప్రజలకు సంతృప్తిగా భోజనం దొరికితే ఆనందంగా ఉంటారుగా, ఇప్పుడు వారికి కావాల్సింది వినోదమే.
పూర్వం అందరూ వినోదం కోసం గంగిరెద్దుల ఆట, నృత్య, గాన ప్రదర్శనలతో సరదాగా గడిపేవారు. దీనికోసం వృషభ రాశి ఏర్పాటు చేశారు. దీనికి అధిపతి అయిన శుక్రుణ్ణి కళలు, సంగీతం వంటి విషయాలన్నీ చూసుకోమన్నారు.
సరదా, సంతోషం, సాహసం పరిధిలో ఉన్నంతవరకు అన్ని బానే ఉంటాయి, అది పరిధి దాటితే ప్రమాదానికి దారి తీయవచ్చు అని ఆలోచించి భద్రత కోసం మేషరాశిని ఏర్పాటు చేసి, కుజుడు సైన్యాధ్యక్షుడు గనుక తన పర్యవేక్షణలో చూసుకోమని చెప్పారు.
కుజుడు భద్రతను కాపాడడడానికి బలమైన ఆయుధాల కోసం యుద్ధకార్మాగారాన్ని వృశ్చికంలో ఏర్పాటు చేసి మంచి మంచి ఆయుధాలను తయారు చేయడం జరిగింది. ప్రజలు భద్రతగా, ప్రశాంతంగా ఉండాలంటే మరొకరు నేరం చేయకుండా ఉండడానికి వారికి దండన, చట్టం అందు భయం కలగాలంటే బలమైన ఆయుధాలు ఉండక తప్పదు.
భద్రత అంటే కొన్ని సందర్భాల్లో అంతర్గతం కావచ్చు, ఇతర రాజుల వల్ల ఉండే ముప్పు కావచ్చు. దానికోసం యుద్ధ ప్రాతిపదిక వంటివి నిర్వర్తించడానికి, రాజ గురువు యొక్క సలహాలు ఎంతో ముఖ్యం అందుకోసం ధనస్సు రాశి ఏర్పాటు చేసి గురువుని యుద్ధం నీతి, వ్యూహరచన, ఎలాంటి ఆయుధాలు ఉండాలి ఇలాంటి విషయాలను రూపొందించమని అడిగారు. పద్మవ్యూహం, చక్రవ్యూహం ఇలాంటివి ఉండేవి అప్పట్లో.
యుద్ధానికి అన్ని సిద్ధమైన యుద్ధ వీరులు లేనిదే ఏమీ చేయలేం కనుక మకర రాశి ఏర్పాటు చేసి శనిని సైన్యాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు.
రాజ్యంలోని చిన్న చిన్న పనుల కోసం, పరిచారకులు వంటి వారికోసం కుంభరాశిని ఏర్పాటు చేసి దానికి శనిని అధిపతి చేశారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు ఉంటుంది. కింద స్థాయిలో వారికి, పనులు చేసుకునే వారికి ప్రజలందరికీ సరైన న్యాయం దొరకడం కోసం తులా రాశి ఏర్పాటు చేసి శుక్రుడికి ఆ బాధ్యతలు అప్పజెప్పారు.
రాజ్యంలో ప్రజలకు పూజలు యగ్నాలు, హోమాలు చేయడానికి మీనరాశి ఏర్పాటు చేసి దేవ గురువైన బృహస్పతిని నియమించారు.
రవిచంద్రులకు ఒక్కొక్క రాశి ఉంది. మిగిలిన ఐదు గ్రహాలకి రెండు రాశులు ఉన్నాయి. రాహు కేతువులకి సొంత రాశులు లేవు. ఇవి చాయాగ్రహాలు.
ఒకరోజు నాకు సొంత రాశి లేదని రాహువు మొరపెట్టుకుంటే, నిజం చెప్పాలంటే విసిగిస్తే రవి పక్కకి జరిగి నా రాశిలో ఉండమని చెప్పాడు. అందుకే రాహువు కు సింహం ఉచ్ఛరాశి అని చెప్తారు. రాహువు వాయు గ్రహం కాబట్టి అగ్నికి వాయువు తోడైతే బలం ఇంకా చెలర్గిపోతాడు, అని ఒక మతంలో చెప్తుంటారు.
గ్రహగమనం :
లేడికి లేచిందే పరుగు అన్నట్టు,మృగశిర నక్షత్రానికి అది దేవత అయిన చంద్రుడు, 30 డిగ్రీల ఒక రాశని 2.5 రోజుల్లో దాటి మరో రాశికి వెళ్ళిపోతాడు. చంద్రుడు 27 రోజుల్లో రోజుకో నక్షత్రంలో ఉంటాడు.
మందగమన సుందర వధనుడైన శని ఒక రాశి దాట దానికి 2.5 సంవత్సరాలు పడుతుంది.
మనం వాడే సోలార్ గడియారం రవి ఆధారంగా ఏర్పడింది. 30 రోజుల్లో ఒక రాశిని, 360 రోజుల్లో రాశి చక్రాన్ని రవి పూర్తి చేసేస్తాడు.
గురువు మాత్రం సంవత్సరానికి ఒక రాశని దాటుతూ 12 జీవనదల్లో పుష్కరాలు జరిగేలా చేస్తాడు. ఒక్కో రాశి మారినప్పుడు ఒక్కో దగ్గర పుష్కరాలు జరుగుతాయి.
కుజుడు 45 రోజుల్లో, బుధ, శుక్రులు 30-35 రోజుల్లో ఒక రాశిని దాటుతారు.
అన్ని గ్రహాలు సవ్య దిశలో వెళ్తే, తన రూటే సపరేట్ అంటూ రాహు, కేతువులు మాత్రం వెనక్కి వెళ్తూ 1.5 సంవత్సర కాలంలో ఒక రాశిని దాటుతాయి.
రవిచంద్రులు ఎప్పుడు అపసవ్య దిశలో వెళ్ళవు కాబట్టే వీటికి వక్రత్వం అనేది ఉండదు. మిగిలిన పంచతారాగ్రహాలు అయిన కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు కొన్ని సందర్భాలలో రవికి దూరంగా ఉన్నప్పుడు వక్రించే అవకాశం ఉంది. నిజానికి అవి ఆకాశంలో వెనక్కి వెళ్ళవు.
ఎప్పుడైతే ఆ గ్రహాల కాంతి భూమిపై ప్రభావం ఉండదో దానివల్ల ఆ సమయంలో పుట్టిన వారి జీవితంలో కొంత భాగం విపరీతమైన ఇబ్బంది, లేక విపరీతమైన పురోగతి ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి, ముందు వచ్చే భాగాలలో మాట్లాడుకుందాం.
కాంతి లేని ప్రపంచం, జీవకోటి మనుగడ ఊహించలేము.
గ్రహాల – ఉచ్ఛ మరియు నీచ రాశులు:
గ్రహాలు ఉచ్చ పొందడం అంటే అవి బలమైన ప్రదేశంలో ఉన్నాయని, నీచ పొందడం అంటే అత్యంత బలహీనమైన ప్రదేశంలో ఉన్నాయని అర్థం.
ఇప్పుడు ఏ గ్రహం ఎక్కడ బలంగా ఉంటుందో చెప్పుకుందాం. ఒక రాజుకు కావలసింది ఏమిటి రాజ్యం సుభిక్షంగా, తన ఆధీనంలో ఉన్నప్పుడు రాజు సంతోషంగా ఉంటాడు.
రాజు సైన్యాధ్యక్షుడైన కుజుడి దగ్గర ఉంటే కుజుడు సరైన విధంగా పని చేస్తాడు, అది ఎలా అంటే పెద్ద అధికారులు వచ్చినప్పుడు చిన్న అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలా పని చేస్తారో అలా అన్నమాట. కాబట్టే రాజైన రవి వచ్చినప్పుడు రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేయడంలో కుజుడు ఏమాత్రం తగ్గదు. అందుకే మేషంలో రవి ఉచ్ఛ పొందుతాడు.
రవి మేషానికొస్తే కుజుడి హడావిడి మామూలుగా ఉండదు. మకరంలోకి వెళ్లి సైన్యాన్ని సిద్ధం చేయాలి. యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేలాగా వాళ్ళని తయారు చేయాలి,ఇదొక్కటే తన ఆలోచన & ఆచరణ అందుకే మకరంలో కుజుడు ఉచ్చ పొందుతాడు.
అందుకే అధికారుల, అధికార దుర్వినియోగం నుండి తమ హక్కులను కాపాడుకోవడానికి ఎప్పుడు శని తులారాశిలో ఉచ్చ పొందుతాడు.
ధైత్య గురువైన శుక్రుడు తనతో సరిపడిన జ్ఞానం కలిగిన దేవ గురువైన బృహస్పతి కి మాత్రమే తన జ్ఞానం అర్థమవుతుందని మీనంలో శుక్రుడు ఉచ్చ పొందుతాడు. శుక్రుడు దగ్గర మృత సంజీవని విద్య కూడా ఉంది. మీనం పూజలు దైవానుగ్రహం వంటి విషయాలకు సంబంధించింది కదా, ఏదైనా వింతలు విడ్డూరాలు జరిగేదానికి చాలా అవకాశం ఉంది.
దైవ గురువైన బృహస్పతి మహారాణికి ఎప్పుడు దైవ మార్గంలో ఉంచేలాగా, తద్వారా రాజ్యమంత భక్తితో నిండేలాగా ఉండాలని కర్కాటకంలో గురువు ఉచ్ఛ పొందుతాడు.
చంద్రుడు కళలను ప్రేమిస్తూ, సరదాగా, సంతోషంగా గడపడానికి వృషభంలో చంద్రుడు ఉచ్ఛ పొందుతాడు. ఉద్యోగం పురుష లక్షణం అయితే స్త్రీ ఆనందంగా ఉంటే కుటుంబాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసుకోవడమేగా.
విచిత్రం ఏమిటంటే బుధుడు తన సొంత రాశి అయిన కన్యలో బుధుడు ఉచ్చ పొందడం జరుగుతుంది. తనకు వ్యాపారం ప్రారంభం, తను తయారు చేసింది అందరికీ పంచడమే తన ధ్యేయం అని భావించడం జరిగింది.
గ్రహాలు – నీచరాశులు :
ఏ గ్రహమైన అది ఉచ్చ పొందిన సప్తమ రాశిలో నీచ పొందడం జరుగుతుంది. ఇప్పటిదాకా గ్రహాలు ఎలా ఉచ్చ పొందాయో అర్థమైతే నీచం ఎక్కడ ఎందుకు అని చెప్పడం చాలా సులువైన పని.
బుధునకు వ్యాపారమే ప్రాణమయ్యి కన్య లో ఉచ్చ పొందితే, భక్తి, దానం వీటికి కొలువైన మీనంలో ఎలా ఉంటాడు, వ్యాపారంలో దానం కుదరదు కదా అందుకే మీన రాశిలో బుధుడు నీచ.
కర్కాటకంలో ఉచ్చ పొందిన గురువు, యుద్ధభూమి వంటి మకరంలో భక్తి బోధ చేయలేడు కదా, అందుకే మకరంలో గురువు నీచ స్థితిని పొందడం జరుగును.
మకరాధిపతయిన శని, సైన్యాధ్యక్షుడు అయినా కుజుడు ఇంట అధికారుల భయానికి, వేగానికి పరిగెత్త లేక శని మేషంలో నీచ పొందును.
కుజుడు యుద్ధ వీరుల యందు తన ప్రతాపం చూపించగలరు గాని, అత్యంత సున్నితమైన మహారాణి గారి దగ్గర మాట మాట్లాడడానికి అయినా చాలా విషయాలను ఆలోచిస్తూ అలానే నిలబడిపోతాడు కదా, అందుకే కర్కాటకంలో కుజుడు నీచ.
చంద్రుడు తన సరదా అంతా వృషభంలో తీర్చుకుంటే, దానికి సప్తమము అయిన యుద్ధ కర్మగారమంటే తన సున్నిత హృదయానికి ఎంతో భయం.
రవి ఎంత అధికారం కలిగి ఉన్నా, న్యాయస్థానం ముందు అందరూ సమానమనేది మనకు తెలిసిందే, ఎంత పెద్ద అధికారం కలిగిన ధర్మం, న్యాయం ఉండే తులలో న్యాయవ్యవస్థ ముందు తలవంచకు తప్పదు.
శుక్రుడు జ్ఞానానికి, భక్తికి, మోక్షానికి విలువ ఇచ్చిన గురువు ఇంటిలో ఉచ్చ పొందితే, అలాంటిదేమీలేని వ్యాపార స్థలమైన కన్యలో నీచ పొందుతాడు.
రాహు కేతువులు నిజమైన గ్రహాలు కావు, అవి చాయాగ్రహాలు, రాహు అగ్నితత్వరాత్రుల్లో బలవంతుడు, కేతువు జల రాశుల్లో బలవంతుడు.
రవి : మేషం (ఉఛ్చ) , తుల (నీచం)
చంద్రుడు : వృషభం (ఉఛ్చ), వృశ్చికం (నీచ)
కుజుడు : మకరం (ఉఛ్చ), కర్కాటకం (నీచ)
బుధుడు : కన్య (ఉచ్చ), మీనం (నీచ)
గురువు : కర్కాటకం (ఉఛ్చ), మకరం (నీచ)
శుక్రుడు : మీనం (ఉఛ్చ), కన్య (నీచ)
శని : తుల (ఉఛ్చ), మేషం (నీచ)
గ్రహమైత్రి :
మనం ఆఫీసులో ఒకలా, ఇంట్లో ఒకలా, మిత్రుడి ఇంట్లో ఒకలా ఉంటాము కదా. అలాగే ఈ గ్రహాలు ఒక రాశినుండి మరొక రాశికి కి వెళ్ళినప్పుడు వాటి లక్షణాలు మారతాయి.
మనకెలా అయితే సొంత ఇంట్లో ఉంటే ఆనందం, మిత్రుడి ఇంటికి వెళితే మర్యాదలు జరుగుతాయో, అలాగే ఈ గ్రహాలకు కూడా స్వక్షేత్రాలు, మిత్ర శతృ క్షేత్రాలు, ఉఛ్చ పొందే రాశులు, నీచ పొందే రాశులు ఉంటాయి.
ప్రతి గ్రహం తానున్న సొంతరాశి నుంచి ఐదు, తొమ్మిది అధిపతులను మిత్రునిగా భావిస్తుంది, ఈ సిద్ధాంతాన్ని పరిశీలిస్తే ఉదాహరణకు సింహరాశి నుంచి ఐదవ రాశి ధనస్సు, తొమ్మిదవ రాశి మేషం కావున రవికి, కుజ గురువులు ఇద్దరూ మిత్రులవుతారు.
అదేవిధంగా అన్ని రాశులని పరిశీలిస్తే గ్రహాలను రెండు వర్గాలుగా విడదీశారు, వాటినే శని పాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలుగా పరిగణించారు.
గురుపాలిత గ్రహాలు : రవి, గురు, కుజ, చంద్ర, కేతువు.
శని పాలిత గ్రహాలు : శని, బుధ, శుక్ర, రాహువు.
గ్రహాలను గుర్తు పెట్టుకోవడానికి చిన్న టెక్నిక్స్ చూద్దాం.
- ఆదివారం / భానువారం అంటే రవి అన్న మాట.
- సోముడు అంటే చంద్రుడు – సోమవారం.
- మంగళుడు అంటే కుజుడు మంగళవారం.
- బుధవారం బుధుడు
- గురువారం గురువు
- శుక్రవారం శుక్రుడు
- శనివారం శని
మిగిలినవి రాహు కేతువులు, వాటికి వారాలు,
రాశులు లేకపోయినా నక్షత్రాలు, దశలు ఎంచక్కా ఉన్నాయి. అవి ఒక ఒంటె లాగా, ఉన్న రాశిని ఆక్రమించుకునే సమర్ధులు.
రంగులు :
ఒకరోజు గురు, శుక్రుడు సరదాగా సంభాషిస్తూ, నేను మొన్ననే ఒక హరివిల్లుని చూశాను ఎంతో అందంగా ఉంది సప్తవర్ణాలలో, మన రాజ్యంలో ఉన్న 12 భాగాలకు ఎందుకు మనం రంగులు వేయకూడదు అని అంటే, ఉన్నపలంగా శుక్రుడి ఆలోచన పూర్తికాకుండానే, రాజుగారైన రవితో మాట్లాడి ఆ రంగుల పనిని శుక్రుడికి పురమాయించేశారు.
శుక్రుడికి ఇలాంటి పనులు అంటే మంచి సరదా,వెంటనే సృజనాత్మకంగా ఆలోచించి
సింహానికి కాషాయం రంగుని, సాయం సంధ్య నాటి సూర్యకారణాలు ఆరోగ్యానికి చాలా విశేషం కాబట్టి.
చంద్రుడి ఇల్లు అయిన కర్కాటకానికి తెలుపు రంగును, మనసు తెల్లని కాగితం అంటారు కదా అందుకే అలా వేసి ఉండొచ్చు.
యుద్ధ వీరుడైన కుజుడి ఇళ్ళకి, యుద్ధానికి సిద్ధం కనుక ఎరుపు రంగుని వేయడం జరిగింది.
శుక్రుడు తన ఇంటికి జ్ఞానానికి చిహ్నమైన తెలుపు రంగునే వాడడం జరిగింది.
పూజలకు, శుభాలకు అధిపతి అయినా గురు ఇంటికి పసుపుని వేశారు.
తూర్పు కాషాయం అయితే, పడమర చీకటి అవుతుందని, కష్టానికి గుర్తుగా శని ఇంటికి నీలం రంగుని వాడడం జరిగింది.
ప్రకృతి ప్రేమికుడు, వంటలు వ్యాపారము వంటి వాటిని ముఖ్యంగా ప్రేమించే బుధుడింటికి ఆకుపచ్చ రంగుని వాడడం జరిగింది.
శుక్రుడి ప్రతిభను గుర్తించిన అందరూ తమ ఆనందాన్ని అన్ని రంగుల పూల గుచ్చాలతో శుక్రుని సత్కరించారు.
గ్రహ దృష్టి :
గ్రహాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహల దృష్టిలను ఏర్పాటు చేశారు. ప్రతి విషయము జ్యోతిష్య ఫలితం చెప్పడానికే అనేది మర్చిపోకూడదు.
సహజంగా ప్రతి గ్రహము తానున్న రాసి నుంచి సప్తమ రాశిని, ఒకవేళ అక్కడ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని చూడడం జరుగుతుంది.
ఖగోళంలో రవి నుండి దూరంగా ఉండే గ్రహాలకు కొన్ని ప్రత్యేక దృష్టులు కూడా ఉన్నాయి.
సప్త గ్రహాలు ( రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని )
సప్తమ దృష్టిని సహజంగా కలిగి ఉంటాయి.
కుజునికి సప్తమ దృష్టితో పాటు, చతుర్ధ, అష్టమ దృష్టులు ఉంటాయి.
శనికి సప్తమ దృష్టిఏ కాక త్రిపాద, దశమ దృష్టి కలిగి ఉండడం జరుగుతుంది.
పూర్ణ శుభుడు అయిన గురు గ్రహానికి పంచము, నవమ దృష్టిలో ఎల్లప్పుడూ విశేషాలే.
స్వరభాను అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు వధించడంతో ఏర్పడిన ముండమే కేతువు, శిరస్సు రాహువు. కావున శిరస్సులేని కేతువు చూడలేదని మోక్ష కారకూడని కొందరి అభిమతం. మరికొందరు అపసవ్య దృష్టితో ఐదవ స్థానాన్ని చూస్తారని అంటారు, అయితే నేను ఇవి పెద్దగా పట్టించుకోను.
ఈ మూడు గ్రహాలకు ఎందుకు ఈ విశేష దృష్టిలో ఉన్నాయో ఆలోచించే ప్రయత్నం చేయండి.
గ్రహ కులాలు :
పుట్టుకతో వచ్చింది కులం, కులం కాదు గుణం వల్ల ఏర్పడింది కులమవుతుంది. సామాజిక కులాలు కుల వృత్తుల చేత ఏర్పడ్డాయి.
- గురు, శుక్ర – బ్రాహ్మణ వర్ణం
- రవి, చంద్ర, కుజులు – క్షత్రియ వర్ణం
- బుధుడు – వైశ్య వర్ణం
- శని – శుద్ర వర్ణం
- రాహు కేతువులు – మ్లెచ్చులు
ఒక వ్యక్తి, ధైర్యం, సాహసం, వృత్తి, పద్ధతి, పరిస్థితి, జ్ఞానం, శక్తి ఇలాంటి అనేక విషయాలను అంచనా వేయడానికి, బోలెడన్ని విషయాలు గ్రహాలకు, రాశులకు, నక్షత్రాలకు ఆపాదిస్తూనే ఉంటారు. మనం ఎలా ఆపాదించారనే రహస్యాన్ని పట్టుకోవాలి.
సహజ శుభులు & పాపులు :
ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలడు, కానీ కొంతమంది కొన్ని విషయాలు సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు.
ఒక పోలీసు అధికారి సరదాకి ఒక కుండ తయారు చేయడం కష్టమేమీ కాదు. ఒక కుమ్మరి కుండ తయారీలో ప్రావీన్యుడుగా ఉంటాడు. అలానే ప్రతి గ్రహం అన్ని విషయాలను ఇవ్వగలుగుతుంది, అదే ఒకవేళ ఆ విషయం మీద దానికి పట్టు ఉంటే ఇంకా బలంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.
అలాగే గ్రహాలను సహజంగా శుభ, ఆశుభ గ్రహాలుగా విభజించి, ఫలిత నిర్ణయానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు.
శుభగ్రహాలు:
- గురుడు
- శుక్రుడు
- బుధుడు ( శుభూలతో కలిసిన, ఒక్కడే ఉన్న )
- చంద్రుడు ( పూర్ణచంద్రుడు )
పాప గ్రహాలు :
- శని
- కుజుడు
- బుధుడు ( పాపులతో కలిసిన )
- రవి
- చంద్రుడు ( క్షీణ చంద్రుడు )
- రాహువు
- కేతువు
శుక్లపక్ష అష్టమి తిధి నుంచి కృష్ణపక్ష సప్తమి తిధి వరకు చంద్రుడు పూర్ణచంద్రుడు గాను, మిగిలిన రోజుల్లో క్షీణచంద్రుడిగాను పరిగణిస్తారు.
మనము సునాయాసంగా గుర్తుపెట్టుకోవడానికి రవి నుంచి చంద్రుడు నాలుగు రాశుల దూరంలో ఉంటే, చంద్రుడు బలంగా ఉన్నట్టు మనం పరిశీలించుకోవచ్చు.
పాప గ్రహాలు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టే శక్తి కలిగి ఉంటాయి, శుభగ్రహాలు కేవలం మానసికంగా మాత్రమే ఇబ్బంది పెడతాయి అనేది ఒక నానుడి.
రాశి విభజన :
ఇంతకుముందు చెప్పినట్టుగానే అనేక విషయాన్ని కేవలం 12 రాశులు 27 నక్షత్రాలు తొమ్మిది గ్రహాలతోనే ఫలితాలు చెప్పాలంటే బోలెడన్ని విషయాలని వీటన్నింటికీ అంటగట్టాల్సిందే.
చర, స్థిర, ద్వి స్వభావ
ఆగ్ని, భూ, వాయు, జల
పురుష, స్త్రీ, నపుంసక
ఫల, నిష్ఫల, మధ్యమ
సారావళి, ఫలదీపిక, బృహత్పర హోరా శాస్త్రం వంటి గ్రంథాలను ఒక్కసారి తిరగేసి పరిశీలించే ప్రయత్నం చేయండి.
నక్షత్రాలు :
27 నక్షత్రాలు (అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ట, శతభిషం,పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి)
ఒక్కో గ్రహానికి 3 సొంత నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాల వరుస ఆధారంగా గ్రహాల వరుస చూడండి. కేతు, శుక్ర, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ.
అశ్విని అధిపతి కేతువు, భరణి కి శుక్రుడు అధిపతి, మాఘ నక్షత్రానికి కేతువే మళ్ళీ అధిపతి అవుతాడు.
మేషంలో అశ్విని, సింహంలో మఖ, ధనస్సులో మూలా నక్షత్రాలకు (1-5-9 రాశులు) కేతువు అధిపతి.
మేషంలో భరణి, సింహంలో పుబ్బ, ధనస్సులో పూర్వాషాడ నక్షత్రాలకు అధిపతి శుక్రుడు.
మేషంలో కృత్తిక, సింహంలో ఉత్తర, ధనస్సులో ఉత్తరాషాడ నక్షత్రాలకు అధిపతి రవి
రోహిణి , హస్త, శ్రవణం – చంద్రుడు అధిపతి
మృగశిర, చిత్త, ధనిష్ట – కుజుడు అధిపతి
ఆరుద్ర, స్వాతి, శతభిషం – రాహువు అధిపతి
పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర – గురువు అధిపతి
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర – శని అధిపతి
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి – బుధుడు అధిపతి.
గ్రహాలు ఏ రాశులలో ఏ నక్షత్రాలలో ఉండాలి:
శని పాలిత గ్రహాలు, వాటికి సంబంధించిన మిత్ర నక్షత్రాల్లో ఉంటే సహజంగా వాటికి అనుకూలం, అలాగే గురుపాలిత గ్రహాలు వాటి మిత్ర నక్షత్రాల్లో ఉంటే అవి వాటికి అనుకూలం.
అలాగే గ్రహాలు, వారందరూ వారి సొంత రాశుల్లో గాని వారి మిత్రులరాశుల్లో గాని ఉన్న బలంగానే ఉంటారు. కేవలం అది వారికి నీచ స్థానం కాకపోతే సరిపోతుంది.
లగ్నం :
రాశి చక్రంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా. ఒక జాతకుడు పుట్టినప్పుడు గ్రహాలు ఏం రాశులలో ఉన్నాయో ఒక ఫొటో తీస్తే అదే జన్మజాతకం, ఎన్ని గంటలకు ఫోటో తీశాను అన్నదే మన జన్మ లగ్నం.
ఒక రోజులో చాలామంది పుడతారు, రెండు గంటల వ్యవధిలో కూడా చాలామంది పుడతారు, కొన్ని సెకన్ల వ్యవధిలో ఒకే ప్రదేశంలో పుట్టడానికి అవకాశం తక్కువ,ఈ లగ్నం అనేది ఇంత సున్నితమైన సమయం గురించి మాట్లాడుతూ, ప్రకృతికి కాపీ కొట్టాల్సిన అవసరం లేదంటూ, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరితోనూ సరిపోరు అని తెలియజేస్తుంది.
భూమి మీద నడిచే గడియారం సూర్యుడి ఆధారంగా ఏర్పడింది, సూర్యుడు ఎల్లప్పుడూ స్థిరమైన వేగంతో కదలడం వల్ల మనమందరం దీనినే పరిగణిస్తున్నాం.
సూర్యుడు వేగం నిర్దిష్టం గనుక లగ్నాన్ని కూడా నిర్దిష్టంగా కొనుక్కోవచ్చు చిన్న ఉదాహరణతో ఎలా లెక్క పెట్టాలి అనేది చూద్దాం.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి సుమారు 365.25 రోజుల సమయం పడుతుంది. దీనిని రాశి చక్రం లో ఇలా అర్థం చేసుకోవచ్చు. సూర్యుడు 360 డిగ్రీలను సుమారుగా సంవత్సర కాలంలో పూర్తి చేస్తే ఒక రాశిని దాటడానికి 30 రోజులు సమయం పడుతుంది, అంటే రోజుకి ఒక డిగ్రీ అన్నమాట.
మనందరికీ సునాయాసంగా గుర్తు ఉండడానికి ప్రతి సంవత్సరం జనవరి 14న మకర సంక్రాంతి, మకర సంక్రమణ రవి పొందిన రోజున జరుపుకుంటాం. అంటే ఆరోజు మకరంలో రవి 0 డిగ్రీలలో ఉంటాడన్నమాట.
అదే రోజు సూర్యోదయం 6 గంటలకు ఆ ప్రదేశంలో జరిగితే, ఒక వ్యక్తి అప్పుడే పుడితే మకర లగ్నం సున్నా డిగ్రీలో పుడతాడు, ఎనిమిది గంటలకు పుడితే కుంభంలో సున్నా డిగ్రీలకి పుడతాడు.
24 గంటలను 12 రాశులకి పంచితే ఒక్కొక్క లగ్నం యొక్క పరిధి సుమారుగా రెండు గంటలన్నమాట. అలా అయితే ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటే 360 డిగ్రీలకు దాన్ని మనం పంచితే, ఒక డిగ్రీ లగ్నం జరగడానికి ఒక రోజులో దాదాపు నాలుగు నిమిషాల సమయం పడుతుంది.
ఏ ప్రదేశంలో అయినా సరైన సూర్యోదయం కనుక్కొని, రవి ఒక్క డిగ్రీల ఆధారంగా లగ్నాన్ని సునాయాసంగా అంచనా వేయొచ్చు.
ఇలాంటి విషయాలు శోధించడానికి బోలెడన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఇప్పుడు, ప్రస్తుతానికి ఈ జ్ఞానం సరిపోతుంది,మనకు, మరింత తెలుసుకోవాలి అనేవాళ్ళు భావ శోధన, ఎస్ మెరిస్ అంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
లగ్న యోగ కారకులు :
సులభంగా అర్థం కావడానికి ఒక చిన్న సూత్రం చెప్తాను, జన్మ సమయం ఆధారంగా లగ్నం ఏర్పడితే, అది కూడా ఒక రాశే కదా, అక్కడనుండి 1-5-9 అధిపతులను లగ్న శుభులు అని అంటారు.
గ్రహాలు లగ్నం నుంచి, మంచి స్థానాల్లో ఉంటూ, లగ్నానికి యోగ కారక నక్షత్రాల్లో ఉంటూ, యోగ కారకులు శుభ స్థానాన్ని పొందితే ఆ జాతకుడు జీవితం సంతోషమైనది అవుతుంది.
ఒక చిన్న విషయం గమనిస్తే, మేష లగ్నానికి గురువు పూర్ణ శుభుడు,యోగ కారకుడు, కుజుడు సహజ పాపి, రవి పాప గ్రహం అయినా యోగకారకలు.
మకర లగ్నానికి శని సహజ పాపి, శుక్రుడు శుభుడు, బుధుడు అర్థ శుభుడు. ఇలా ప్రతి లగ్నానికి అందరూ యోగ కారకులు శుభులు, పాపులు సమానంగా పంచబడినాయి.
భావాలు :
లగ్నం నుండి మొదటి రాశిని మొదటి భావమని, రెండవ రాశిని రెండో భావం అని అలా 12 రాశులు లెక్కించడమే.
కోణములు : 1, 5, 9
కేంద్రములు : 1, 4, 7, 10
దుస్థానాలు : 6, 8, 12
ఉపచయములు : 3, 6, 11
కోణ స్థానాలు పూర్వ కర్మ యొక్క అదృష్టాన్ని తెలుపుతాయి, గ్రహాలు ఆ స్థానంలో ఉండడం వల్ల మన అదృష్టం కొద్దీ జీవితం సునాయాసంగా సాగుతుంది.
కేంద్రాలు మన సామర్థ్యాన్ని, కష్టాన్ని తెలియజేస్తాయి.
కష్టానికి, అదృష్టం తోడవడమే గొప్ప యోగంగా మారుతుంది, అందుకే కేంద్ర కోణాధిపతుల కలయికని రాజయోగంగా చెప్తారు.
దుస్థానాల్లో ఉన్న గ్రహాలు కొన్ని ప్రత్యేక సందర్భంలో తప్ప శుభ ఫలితాలను ఇవ్వవు.
ఉపచయ స్థానాల్లో ఉన్న గ్రహాము పాప గ్రహం అయితే తన శక్తిని మించిన ప్రయత్నం చేస్తూ సాధించే ప్రయత్నం చేస్తుంది. మంచి ఉదాహరణ చెప్పాలంటే చీమ తన బరువు కన్నా ఎన్నో రెట్లు బరువు మోయగలుగుతుంది.
12 భావాల నుండి ఎలాంటి విషయాలు మనం చెప్పే ప్రయత్నం చేయొచ్చు అని కొంత ఉదాహరిస్తున్నాను. మీరు ప్రపంచంలో ఏ విషయానికి ఏ భావము సరైనది అనేది ఊహించే ప్రయత్నం చేయండి. జ్యోతిష్యం ఒక భాష లాగా అర్థం చేసుకోండి, ప్రపంచంలో ప్రతి విషయాన్ని గ్రహం లాగా, భావంలాగా, రాశిలాగా, నక్షత్రంలాగా ఊహించక తప్పదు.
1 లగ్నం : తను భావం, శరీరం.
2 ధన స్థానం : కుటుంబం, ధన సంబంధమైనవి.
3. విక్రమ స్తానం : సోదరులు, పట్టుదల, చేతులు.
4. చతుర్ధ స్తానం : తల్లి, ప్రాధమిక విద్య.
5. పంచం స్తానం : విద్యా , జ్ఞాన స్తానం, సంతానం.
6. షష్టమ స్తానం : శత్రు, రోగ, రుణస్థానం.
7. సప్తమ స్తానం : కళ్లత్రం, భార్య, పార్ట్నర్, వ్యాపారం.
8. అష్టమ స్తానం : ఆయుర్దాయం, శరీరం, ప్రమాదాలు
9. భాగ్య స్తానం : పితృ స్థానం, గురువు, పూర్వ పుణ్యం
10. దశమ స్తానం : కర్మ స్థానం, ఉద్యోగం, వ్యాపారం
11. లాభ స్తానం : సునాయాస ధన లాభం, మిత్రులు
12. వ్యయ స్తానం : వ్యయం, నిద్ర, శయ్య సుఖం.
దిక్కులు :
కుజు శుక్రులు ఇద్దరికీ ఆటలు అంటే విపరీతమైన పిచ్చి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏదైనా ఒక ఆట ఆడుకుందాం అని అందరికీ చెప్పారు.
సరే మనం అందరం కలిసి ఒక బంతితో ఒక ఆట ఆడుకుందాం అని సూర్యుడు తూర్పున వెళ్లి నిలబడడం జరిగింది. నేనెప్పుడూ తూర్పున ఉదయిస్తుంటాను కదా, నాకు అది అంటేనే ఇష్టం అని చెప్పాడు.
సూర్యుడికి ఎంత దూరంలో ఉన్న నేను, పడమట నా సొంతం అంటూ శని అక్కడే ఉండడం జరిగింది.
భరణి నక్షత్రానికి అధిదేవతైన యముడు నాకు మంచి మిత్రుడు అంటూ దక్షణలో కుజుడు నిలబడడం జరిగింది.
ఉత్తరాన ఉంటే అందరూ నన్ను ఉత్తముడు అనుకుంటారని, బుధుడు తన బుద్ధి బలంతో ఆలోచించి, ఉత్తరాన్ని ఎంచుకున్నాడు.
గొప్ప రుచి గల వంట తయారు చేయడం నా సొంతమంటూ ఆగ్నేయంలో శుక్రుడు నిలిచాడు.
నా మానసిక వేగాన్ని ఎవరు అందుకోలేరు అంటూ వాయువ్యంలో చంద్రుడు చేరుకున్నాడు.
ధనానికి, శుభానికి ఈశాన్యం దారంటూ గురు, కేతువులు నిలిచారు, ఒకరికి ధనం పూర్వ కర్మ వలన, మంచి గుణం వలన చేకూరుతుంది.
కేతుకు దూరంగా ఉండటం నాకు అలవాటే కదా అని రాహు వెళ్లి నైరుతిలో నిలబడ్డాడు.
అందరూ నవ్వుతూ ఇక బంతి తో ఆట మొదలు పెడదామా అంటూ, భూమిని చూసి నవ్వారు.
( అష్టదిక్కులు, పంచభూతాలు మనం చేసే ప్రతి కర్మను పరిశీలిస్తూ కర్మ ఫలితాన్ని ఇస్తూనే ఉంటాయి )
దిగ్బలం :
జాతక చక్రంలో కేంద్ర స్థానాలు ఒక వ్యక్తి సామర్థ్యం, ఎంతవరకు కష్టపడగలడు అనేది తెలియజేస్తాయి.
ఇక్కడ దిక్కు అంటే కాలమని అర్థం, మనిషి నాలుగు కాలాలను అనుభవిస్తాడు. ఇది ఒక రకంగా జీవితకాల చక్రం కూడా అవుతుంది, అది మనం జాతక చక్రంలో పరిశీలించవచ్చు.
- ఉదయం
- మధ్యాహ్నం
- సాయంత్రం
- అర్ధరాత్రి
ఉదయం విద్యార్థి దశ, మధ్యాహ్నం యవ్వన దశ, సాయంత్రం వృద్ధాప్యం, అర్ధరాత్రి చివరి దశ.
విద్యార్థిగా ఉన్నప్పుడు జ్ఞానం సంపాదించాలి, యవ్వనంలో మంచి ఉద్యోగం చేసి, జీవితానికి సరిపడా డబ్బు సంపాదించాలి, వృద్ధాప్యంలో కష్ట ఫలితం వల్ల మిగిలిన ధనంతో సుఖాన్ని పొందాలి, చివరిగా గాఢ నిద్రలోకి వెళ్లడమే గా.
జాతక చక్రంలో లగ్నం ఉదయం అవుతుంది, దశమ స్థానం మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం సప్తమ స్థానం అవుతుంది, చతుర్ధం అర్ధరాత్రి అవుతుంది.
సహజంగా గ్రహాలు ఈ విధంగా ఉంటే జాతక చక్రంలో మంచిది. అలా లేకపోయినా ఏదో ఒక సంబంధం ద్వారా మనం దాన్ని తర్వాత వ్యాసాలలో ఎలా చూడాలనేది చెప్తాను.
- లగ్నమందు గురు, బుధ
- దశమంలో రవి, కుజ, కేతువులు
- సప్తమంలో శని, రాహులు
- చతుర్దంలో శుక్ర, చంద్రులు
లగ్నంలో గురు, బుదులు ఒక విషయాన్ని నేర్చుకోవడంలో జ్ఞానం సంపాదించడంలో సిద్ధహస్తులు.
అధికారం ఎలా చలాయించాలి అనే విషయంలో రవి, కుజ, కేతువులు గొప్పవారు. ఉద్యోగానికి, సాధించాలనే తపనకి, పేరు ప్రఖ్యాతలకి, సామర్ధ్యానికి దశమ స్థానం చాలా గొప్పది.
సామాజిక సంబంధాలు, వ్యాపార, వ్యవహార సంబంధాలకు సప్తమ స్థానం ముఖ్యమైనది, వివాహం విషయానికొస్తే ఇరువైపుల కుటుంబాలను నిర్వహించాలంటే మామూలు విషయం కాదు, శని రాహువు లు ఉంటే తప్ప అది జరగదు, అందుకే శని సహజ సప్తమ రాశిలో ఉచ్చ పొందుతాడు. ఒక వ్యక్తిని కన్విన్స్ అన్న చేయాలి,లేకుంటే కన్ఫ్యూజ్ అన్న చేసేయాలి.
సాయంత్రం సరదాగా, సౌఖ్యంగా కుటుంబంతో ఉండాలంటే స్త్రీ కారక గ్రహాలైన చంద్ర, శుక్రులు లేనిదే ఎవరు సంతోషాన్ని పొందలేరు.
గ్రహాలు ఏ రాశుల్లో బలంగా ఉంటాయి :
ఒక గ్రహం, ఏ రాశిలో ఉంది, అది దానికి అనుకూలమా కాదా, దాని నక్షత్రం అనుకూలమా, నక్షత్రాధిపతి అనుకూలమైన స్థానంలో ఉన్నాడా ఒక ఆకుపై మరో ఆకు పేర్చినట్టుగా ఓర్పుతో పరిశీలిస్తూ పరేషాన్ కాకూడదు.
నేను ఒక గ్రహానికి ఆ రాశి ఎందుకు మంచిది అని ఇలా ఎందుకు రాశానని ఆలోచించండి, ముందు వచ్చే పాటల్లో మీకు సులభంగా అర్థమయిపోతుంది.
ప్రతి గ్రహానికి అనుకూల రాశులు :
- రవి ( సింహం, మేషం, వృశ్చికం, కర్కాటకం, మిధునం, కన్య, ధనస్సు, మీనం )
- చంద్ర ( కర్కాటకం, సింహం, వృషభం, తుల, ధనస్సు, మీనం )
- కుజ ( మేషం, వృశ్చికం, మకరం, కుంభం, ధనస్సు, మీనం, సింహం )
- బుధ ( కన్య, మిధునం, వృషభం, తుల, సింహం, మకరం, కుంభం )
- గురు ( ధనస్సు, మీనం, కర్కాటకం, మేషం, వృశ్చికం, సింహం )
- శుక్ర ( తుల, వృషభం, మీనం, ధనస్సు, మకరం, కుంభం )
- శని ( మకరం, కుంభం, తుల, వృషభం, మిధునం, కన్య )
చీకట్లో రవిచంద్రులు :
సూర్యగ్రహణం చంద్రగ్రహణం తెలియని వాళ్లు భూమి మీద ఉండరు. సూర్యకాంతి లేనిదే జీవజాతి మనుగడ లేదు.
సూర్యుడి కాంతి అన్ని గ్రహాల మీద పడి,దాని నుండి భూమి మీద పడుతుంది, గ్రహాలు ఎప్పుడు సంచరించడం వలన కొన్ని సందర్భాలలో సూర్యుడికి దూరంగా గ్రహాలు వెళ్లడం వలన వాటిపై సూర్యకాంతి పడకపోవడం, కొన్ని సందర్భాల్లో వాటి కాంతి భూమి మీద పడకుండా ఏదో ఒక గ్రహం అడ్డు రావడం ఇలా రకరకాల కారణాలవల్ల ఆగ్రహాల కాంతి భూమి మీద ప్రసరించకపోవడాన్ని వక్రత్వం అంటారు, దీనిని నేను శాపం లాగా పరిగణిస్తాను.
రవిచంద్రులు వక్రీంచకపోయినా రాహుకేతులతో కలవడం వల్ల కాంతి ప్రసరించదు, పంచతార గ్రహాలైన శని, కుజ, గురు, బుధ, శుక్రులు వక్రీస్తే వారి కాంతిని ప్రసరింప చేయలేం.
ఎప్పుడైతే గ్రహాలు స్వక్షేత్రగతులు కావో ఇలాంటి దోషం ఏర్పడినప్పుదు జాతక చక్రంలో ఏ భావంలో ఏర్పడుతుందో అక్కడ కొన్ని ఓడిదుడుకులు చూడాల్సిందే.
దీని గురించి మరింతగా ముందు పాఠాల్లో వివరించే ప్రయత్నం చేస్తాను.
వింసొత్తరి దశ ( గణితం )
దశావిదానం, సినిమా పరిభాషలో చెప్పాలంటే స్క్రీన్ ప్లే లాంటిది. జాతక చక్రంలో అన్ని కనిపిస్తాయి,ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియజేసేదే దశ పద్ధతి.
పరాశర జ్యోతిషంలో అత్యంత పేరు పొందిన దశ వింసోత్తరీ దశ. మహర్షి 42 దశలు గ్రహస్థితి ఆధారంగా ఏ సందర్భంగా ఏది వాడాలని తెలియజేశారు. సహజంగా ఇది పరిశీలిస్తూ, గ్రహ స్థితిని బట్టి మరో దశ కూడా చూస్తూ ఉంటారు. ప్రస్తుతానికే కాదు భవిష్యత్తులో కూడా ఇది మాత్రమే చూస్తూ మనం మంచి ఫలితాలు చెప్పొచ్చు.
- కేతువు 7 సంవత్సరాలు
- శుక్రుడు 20 సంవత్సరాలు
- రవి 6 సంవత్సరాలు
- చంద్రుడు 10 సంవత్సరాలు
- కుజుడు 7 సంవత్సరాలు
- రాహువు 18 సంవత్సరాలు
- గురువు 16 సంవత్సరాలు
- శని 19 సంవత్సరాలు
- బుధుడు 17 సంవత్సరాలు
గ్రహబలం :
సాంప్రదాయ జ్యోతిష్యంలో అనేక మార్గాల ( వర్గ చక్రాల గ్రహ స్థితి, షబ్బలాలు, దిగ్బలం, అష్టకవర్గు, అవస్థలు ) ద్వారా ఈ గ్రహబలాన్ని కనుక్కొని జ్యోతిష్య ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ నా మట్టిబుర్రకు అవన్నీ అంత సునాయాసంగా అర్థం కాకపోవడం వల్ల, నా మనుగడకు నా ప్రయత్నంలో నక్షత్ర జ్యోతిష్యం నన్ను అయస్కాంతం లాగా లాగింది. ప్రస్తుతానికి నాకు వచ్చిందే మీకు చెప్తాను.
గ్రహబలం కనుక్కొని, జీవితంలో ఏది దక్కుతుంది ఏది దక్కదు అని తెలుసుకొని, అది ఎప్పుడు జరుగుతుంది అని కనుక్కుంటే జాతక విశ్లేషణ అయిపోయినట్టే.
ప్రతి గ్రహము, లగ్నమునకు అనుకూలమైన స్థానములో ఉంటూ, అనుకూల నక్షత్రంలో ఉంటూ, ఆ నక్షత్రాధిపతి అనుకూల స్థానంలో ఉంటే ఆగ్రహం బలంగా ఉన్నట్టే.
జాతక విశ్లేషణ :
ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో శ్రవణా నక్షత్రంలో ఉండి, చంద్రుడు, గురువు తొమ్మిదవ స్థానంలో ఉత్తరాషాడ నక్షత్రంలో ఉంటే అది గొప్ప ఫలితాన్ని కచ్చితంగా ఇస్తుంది.
ఎందుకంటే లగ్నాధిపతి అయిన కుజుడు యోగ కారకుడైన చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉంటే, చంద్రుడు పూర్వ పుణ్య స్థానమైన తొమ్మిదిలో ఉంటూ, ఆ రాశి అధిపతి యోగ కారకుడైన గురువుతో కలవడం వలన మెండుగా పూర్వ పుణ్య యోగం పొందగలడు.
లగ్నాధిపతి దశమ స్థితిని పొందడం వలన, కేంద్రాధిపతయిన చంద్రుడు కోణాధిపతి అయిన గురువుతో కలవడం వలన, ఇలా అనేక రకములుగా ఆ జాతకుడు విశేషాబివృద్ధి జీవితంలో పొందగలడు.