ఉపోద్ఘాతం :
గత వ్యాసంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగ కారకులని తెలుసుకున్న, ఎందుకు ఎలా అనేది మనకు అర్థం అయితే, వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందనేది మనకి లాజికల్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వచ్చే ప్రతి జాతకంలోనూ అన్ని గ్రహాలు మనం అనుకున్న విధంగానే ఉండవు కదా, అయినా కూడా అవి మంచి ఫలితాలు ఎలా ఇస్తున్నాయి అనేది దాని వెనకున్న లాజికల్ రీజనింగ్ అర్థం కావాలి.
లగ్నం :
జీవికి ప్రాణమే ఆదారం, జాతక చక్రంలో లగ్నమే ఆధారం. ఎందుకంటే ఒకరోజులో చాలామంది పుట్టొచ్చు, కానీ ఒక లగ్నం యొక్క డిగ్రీలో చాలా తక్కువ మంది పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పే సంఘటనలు, ఫలితాలు కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే సరిపోయేంత కచ్చితత్వాన్ని తెలియజేస్తుంది.
జన్మజాతకం అంటే మనం పుట్టిన నాటి గ్రహ స్థితి తెలియజేస్తుంది, ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు పుట్టాం,అనేది తెలియజేసేదే లగ్నం. 12 రాశులే 12 లగ్నాలు అవుతాయి.
లగ్న యోగ కారుకుల వల్ల ఉపయోగం :
బిడ్డ పుట్టగానే నడవడానికి ఎలా ప్రయత్నిస్తాడో, జ్యోతిష్యం నేర్చుకున్న రెండో రోజు నుంచి నాకు లగ్నం నుంచి ఈ గ్రహం అక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఫలితం ఎలా ఉంటుందనేది, గూగుల్ తల్లిని, chat gpt మామను అడగడం అలవాటైపోతుంది.
లగ్నం ఆధారంగా ప్రతిగ్రహం ఎక్కడ ఉందో, సహజంగా లగ్నం నుంచి వారి ఇల్లు ఏదో అక్కడ కాకుండా ఎక్కడోక్కడ గ్రహ చలనం వల్ల ఉండడం జరుగుతుంది కదా, అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి లగ్నం చాలా ముఖ్యం.
అయితే మనము నక్షత్ర జ్యోతిష్యాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి, ఏ గ్రహము లగ్నం నుండి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం కన్నా, ప్రతి గ్రహం యొక్క నక్షత్రాధిపతి లగ్నం నుండి ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలియడం వల్లే సరైన ఫలితాలు చెప్పగలుగుతాం.
గణిత పరిభాషలో చెప్పాలంటే, లగ్నం నుంచి ఒక గ్రహము ఒక స్థానంలో ఉంటే దానికి కేవలం 25 శాతం మాత్రమే బలం కలిగి ఉంటుంది, దాని నక్షత్రాధిపతి ఎక్కడున్నాడో దాని స్థానానికి 75% బలం కలిగి ఉంటుంది, ఈ ఉదాహరణతో నక్షత్రాధిపతికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాము అర్థం చేసుకోవచ్చు.
భావాలు :
లగ్నం నుండి 12 రాశులని లెక్కపెట్టడాన్ని, 12 భావాలు అనుకుందాం. ఈ 12 భావాలలో కొన్నింటిని శుభ భావాలుగా, కొన్నింటిని ఆ శుభ భావాలుగా విడగొట్టారు.
శుభ భావాలు
కోణ స్థానాలు ( అదృష్టం, పూర్వ పుణ్యం ) 1,5,9
కేంద్ర స్థానాలు ( కష్టపడి సాధించడం ) 1,4,7,10
ధన స్థానాలు : ( సునాయాసంగా సాధించడం ) 2, 11
ఆశుభ భావాలు
దుస్థానాలు : 3, 6, 8, 12
ఆశుభ భావాలలో ఉన్న గ్రహాలు, సహజంగా అంత సునాయాసంగా శుభకరమైన ఫలితాలు ఇవ్వవు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప.
లగ్న యోగ కారకులు :
లగ్న యోగ కారకులు లగ్నం నుండి ఒకటి ఐదు తొమ్మిది అధిపతులు కావడం వల్ల, వాళ్లు సహజంగా లగ్నాధిపతికి పరమ మిత్రులు, పరస్పరం మిత్రులు అవడం వల్ల, అవకాశం ఉన్నప్పుడు మన మిత్రుడు ఎలా సహాయపడతాడో, అది కూడా దశ వచ్చినప్పుడు అదే విధంగా జాతకుడు జీవితంలో వృద్ది లోకి రావడానికి తోడ్పడతాయి.
లగ్నం – ప్రస్తుత జన్మ, భాగ్యస్థానం – గత జన్మ యొక్క పూర్వపుణ్యం, పంచమ స్థానం,గత జన్మలో చేసుకున్న పూర్వపుణ్యం, ప్రస్తుత జన్మ, గత జన్మ పూర్వ పుణ్యం వల్ల కలిగింది.
ఈ పూర్వ పుణ్యం అనేదానికే ఒక చిన్న ఉదాహరణకు అర్థం చేయిస్తాను, నేను ఒక పది రూపాయలు పెట్టి ఒక అనాస పండు కొనుక్కోడానికి వెళ్లాను, నాకు పూర్వ పుణ్యపు అనుగ్రహం వల్ల, అమ్మేవాడు నా చిన్ననాటి మిత్రుడు అయ్యి నన్ను గుర్తుపట్టి పది పళ్ళు పొట్లం కట్టి పంపించాడ.
పూర్వపుణ్య అనుగ్రహం వల్ల ప్రయత్నానికి పది రెట్లు ఫలితందొరికి జీవితంలో గొప్ప అభివృద్ధి కలుగుతుంది. దీన్ని బట్టి జీవితంలో సత్కర్మ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
ఇప్పుడు 12 లగ్నాలకు యోగ కారకులు ఎవరు, ఎలా ఉంటే బాగుంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాసం ఆధారంగా మీరు ఫలిత జ్యోతిష్యంలో ఎంతో కొంత పురోగతిని సాధించాలని ఆశిస్తున్నాను.
Shri NV Raghavachari గారు, మీనా 2 నాడి అనే పేరుతో, మూడు నాడీ జ్యోతిష్య గ్రంధాల నుంచి పరిశోధన చేసి యోగకారక గ్రహమును గురించి మనకి ఉపయోగపడే జ్ఞానాన్ని అందించారు, దాని ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
12 లగ్నాలకు యోగించే యోగ కారకుల గురించి నేనిప్పుడు మీకు వివరిస్తాను. నాకు అర్థం అయిన విధానం ప్రకారం శుభగ్రహమై కేంద్ర మరియు కోణాధిపతి అయిన గ్రహాలను యోగ కారకులుగా తీసుకొనబడినది. శని మరియు కుజుడు పూర్తి సహజ పాప గ్రహాలు అవడం వల్ల ఏ లగ్నానికి విశేష యోగ కారకులు కారు, రాహు & కేతులకు సొంత రాశులు లేవు, మరియు వాళ్ళు సహజ పాపులు అవ్వడం వాళ్ళ ఏ లగ్నానికి యోగకారకులు కారు.
01 ) మేష లగ్నం :
మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు పాపి అవ్వడు, కానీ కుజుడు సహజ పాపి. పంచమ కోణాధిపతి రవిని పూర్తి పాప గ్రహంగా తీసుకోలేదు, అందుకని రవిని యోగ కారకుడిగా తీసుకొనబడినది. మిత్ర వర్గంలో ఉన్న చంద్రుడు, పంచమ కోణాధిపతి అయిన రవి మరియు 9వ ఇంటి అధిపతి అయిన గురువు యోగ కారకులు.
కావున మేష లగ్నానికి చంద్ర, రవి, గురు, గ్రహముల నక్షత్రముల మీద ఏదైనా గ్రహాలు ఉండి మంచి యోగాలను కలిగి ఉన్న ఇది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
ఉదాహరణ: మేష లగ్నానికి చతుర్దములో గురుచంద్రులు కలిస్తే అది ఒక మంచి గజకేసరియోగం అవుతుంది. ఎందుకంటే వాళ్లు లగ్నానికి యోగకారకులు. అందులోనూ పునర్వసు నక్షత్రంలో ఉన్నారంటే ఇంకేంటి, గురువు నక్షత్రం చంద్రుడి రాశి గురు చంద్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.
అదే పుష్యమి నక్షత్రం అయితే అక్కడ ఉచ్ఛస్థితి, స్వక్షేత్రం అయినా కూడా శని ఆధిపత్యం మారిపోతుంది. లగ్న యోగ కారకులు మంచి స్థానాలలో ఉంటే మంచిది. మంచి స్థానంలో ఉండి దాని నక్షత్రం లో ఇంకో గ్రహం ఉంటే కూడా మంచిది. మేష లగ్నానికి రవి గురువులు లగ్నం మీద ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది.
ఒక గ్రహం విపరీత యోగాన్ని ఫామ్ చేయొచ్చు, కానీ దానితో పాటు యోగ కారకుడు కలిశాడు అనుకో చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఒక లగ్నానికి కేంద్ర కోనాధిపతులు కలిశారు, ఉదాహరణకు మేష లగ్నానికి శని, గురువులు కలిశారు ఎక్కడ కలిస్తే మంచిది? మకరంలో కలిస్తే గురు శనిల కలయిక అంత మంచి ఫలితాలను ఇవ్వదు. మేష లగ్నానికి గురు శనిలు లాభంలో కలిస్తే గురు నక్షత్రంలో మంచి ఫలితాలు ఇస్తుంది.
శని సప్తమంలో ఉచ్చ పొందాడు, గురువు చతుర్దంలో ఉచ్చ పొందాడు శని దశమ దృష్టితో యోగ కారకుడైన గురువుని చూస్తున్నాడు, శని కేంద్రాధిపతి అయి మరొక కోనాధిపతిని చూస్తున్నాడు రెండు కూడా కేంద్రాలలో ఉన్నాయి అది మంచి ఫలితాలు ఇస్తాయి.
02) వృషభ లగ్నం :
వృషభ లగ్నానికి బుధుడు ఒక్కడే విశేష యోగ కారకుడు, శుక్రుడు శని పనిచేస్తారు కానీ మీనా 2 నాడీలో నాడీ గ్రంథాల నుంచి తీసుకొని చెప్పబడింది కాబట్టి దాన్ని అదేవిధంగా ఇంప్లిమెంట్ చేస్తే కావలసిన ఫలితాలు వస్తాయి.
వృషభ లగ్నానికి లగ్న షష్ఠాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని, అవుతాడు ఇక్కడ శని సహజ పాపి కాబట్టి యోగ కారకుడు అయినా బలమైన యోగకారకుడిగా తీసుకొనబడడు. బుధుడు అర్థ పాపి శుభులతో కలిస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. అందువల్ల బుధుడిని యోగ కారకుడిగా తీసుకున్నారు.
ఉదాహరణ: వృషభ లగ్నానికి కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం కదా, లగ్నంలో శుక్రుడు బుధుడు కలిశారు అనుకోండి, లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి లగ్నంలో కలిశారు, రెండు శుభగ్రహాలు లగ్నంలో ఉన్నాయి అవి మంచి ఫలితాలను ఇస్తాయి.
తుల ఆరో స్థానం శుక్ర బుధులు కలిశారంటే ఆరవ స్థానంలో పర్వాలేదు. శుభగ్రహాలు కేంద్ర కోణాలలో ఉండాలి పాపగ్రహాలు 3, 6, 11 స్థానాలలో ఉండాలి.
ద్వితీయ, పంచమాధిపతి అయిన బుధుడు ఎలాంటి యోగం ఫార్మ్ చేస్తాడు అంటే, ఉదాహరణకి శని బుధులు కలిసి దశమంలో ఉంటే యోగ కారకుడితో కలిశాడు చాలా మంచిది.
మీనంలో శని బుధ నక్షత్రంలో ఉండి, కన్యలో బుధుడు ఉంటే, శని బుధుడిని చూస్తూ, బుధ
నక్షత్రంలో ఉండి ఉచ్చలో ఉన్న బుధుడి చేత చూడబడుతూ ఉంటాడు అప్పుడు చాలా బాగుంటుంది. శనిబుదులు మీనంలో రేవతిలో ఉంటే అది కూడా బాగుంటుంది, కానీ బుధుడు నీచం పొందుట వలన అంత యోగం ఉండదు.
బుధ శుక్రులు సప్తమంలో జేష్ఠ లో ఉంటే, కేంద్రాధిపతి అయిన లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తూ బుధుడితో కలిసి కుజుడి రాశి లో ఉంటాడు. ఒకవేళ కుజుడు దశమంలో దిగ్బలాన్ని పొందితే బాగుంటుంది. కన్యలో బుధ శుక్రులు ఉంటే బుధుడు శుక్రుణ్ణి కంట్రోల్ చేస్తాడు.
03) మిథున లగ్నం :
మిధున లగ్నానికి శుక్రుడు ఒక్కడే యోగ కారకుడు. బుధుడికి ఉభయ కేంద్రాధిపత్యం ఉంది & శని సహజ పాపి అష్టమ భాగ్యాధిపతి కావున వాళ్లు యోగ కారకులు కారు.
ఉదాహరణ: శని శుక్రులు పూర్వాషాడలో సప్తమంలో ఉంటే, సప్తమంలో శని దిగ్భలాన్ని పొందుతూ యోగకారకుడితో కలిసి ఉంటాడు. దాని వలన మంచి యోగం ఏర్పడుతుంది. పంచమ దశమాధిపతి అయిన గురు శుక్రులు మరియు పంచమ నవమాధిపతి అయిన శని శుక్రులు కలిసిన యోగం ఉంటుంది.
శుక్రుడు మీనంలో రేవతి నక్షత్రంలో ఉచ్చ పొందుతాడు. అప్పుడు బుధుడు లగ్నం మీద బాగుంటే లగ్నం మీద ఉన్న బుధుడు ధిగ్బలం పొందుతాడు. దశమంలో శుక్రుడు చతుర్ధాధిపతి నక్షత్రములో దిగ్బలాన్ని పొందుతాడు అదేవిధంగా శని తో కలిసి ఉండుటవలన కోనాధిపతితో కలిసి నందుకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. గురు శుక్రులు కలిసిన పంచమ దశమాధిపతులు కలయిక బాగుంటుంది.
శని శుక్రులు అష్టమములో కలిసిన కూడా మిథున లగ్నానికి వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమములో ఉండటం విపరీత యోగం. దానితోపాటు యోగకారకుడైన శనితో కలిసి ఉంటాడు ప్రాబ్లం ఇచ్చిన తరువాత మంచి రిజల్ట్స్ ఇస్తాడు.
అష్టమాధిపతి షష్ఠమంలో ఉండడం విపరీత యోగం. షష్టమంలో అనురాధ నక్షత్రంలో శని ఉంటే అది బలమైన యోగం. దానితోపాటు శుక్రుడు యోగకారకుడు కలిస్తే దానిమీద గురు శుభదృష్టి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది.
కుజుడు షష్ఠమాధిపతి అష్టమంలో పడ్డాడు ఉచ్చ పొందాడు అది శుక్రుడితో కలిసి ఉంటే యోగ కారకుడితో కలిసి ఉండటం బాగుంటుంది.
04) కర్కాటక లగ్నం :
కర్కాటక లగ్నానికి గురువు యోగ కారకుడు. భాగ్య షష్ఠాధిపతి అయిన గురువు అష్టమంలో ఉంటే విపరీత యోగం శని ష్షష్ట స్థానంలో ఉండొచ్చు.
ఉదాహరణ: లగ్నంలో గురుచంద్రులు కలిస్తే గజకేసరి యోగం పడుతుంది. లగ్నంలో గురుచంద్రులు పునర్వసు నక్షత్రములో పాపగ్రహాలు చూడకుండా ఉంటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
గురుచంద్రుడు వృషభంలో ఉచ్చ పొంది ఉంటే కృతికలో గురుచంద్రునుండి దశమంలో రవి ఉంటే, మేషంలో రవి దిబ్బలం పొందుతాడు. ఉచ్చ పొందిన గ్రహం యొక్క నక్షత్రములో గురువు ఉండటం విశేషం.
మన రాఘవాచార్యులవారు చెప్పిన ప్రకారం గ్రహము యొక్క నక్షత్ర అధిపతిని తీసుకొని యోగ కారకుడా కాదా అని చూడాలి.
05) సింహ లగ్నం :
సింహ లగ్నానికి బలమైన యోగ కారకుడిగా పంచమాధిపతి అయిన గురువును తీసుకోవడం జరిగింది. రవి లగ్నాధిపతి అవుతూ కేంద్ర కోణాధిపతి అవుతాడు కావున రవి కూడా శుభుడే.
ఉదాహరణ: పంచమాధిపతి మరియు అష్టమాధిపతి అయినా గురువు రవితో కలిసి లగ్నంలో ఉండటం ఒక యోగం.
రవి గురువుల కలయిక లగ్నం మీద ఉంటే బాగుంటుంది. పంచమ అష్టమ అధిపతి గురువు వ్యయంలో కూడా ఉండవచ్చు. గురుచంద్రులు వ్యయంలో పునర్వసులో ఉంటే వ్యాయాధిపతితో అష్టమాధిపతి విపరీత రాజయోగం ఇస్తాడు.
రవి గురువు నక్షత్రంలో దశమంలో దిగ్బలం పొందుతాడు. దశమాధిపతి అయిన శుక్రుడు కుజుడుతో కలిసి లగ్నం మీద ఉంటాడు, అంటే దశమాధిపతితో భాగ్యాధిపతి అయిన కుజుడు కలిసి ఉంటే దాన్ని గురువు పంచమం నుంచి భాగ్యం నుంచి చూస్తే మంచిది.
సింహ లగ్నానికి సప్తమంలో శని ఉంటే శశి మహాపురుషయోగం. అదే గురు నక్షత్రంలో ఉంటే, శని సప్తమంలో దిగ్బలం పొంది యోగకారక నక్షత్రంలో ఉంటాడు. యోగ కారకుడైన కేంద్రాధిపతి అయినవాడు కోనాధిపత్యం పట్టిన గురువు యొక్క నక్షత్రం మీద ఉంటూ గురువు బలంగా ఉండి లగ్నపంచమంలో ఉంటే బాగుంటుంది.
కుజ గురువులు దశమంలో లేదా దశమాధిపతి నక్షత్రములో కలిస్తే బాగుంటుంది లేదా కుజ గురువులు పంచమంలో ఉన్నారు పంచమంలో కుజుడు పాపగ్రహం అయినా గురువు కంట్రోల్ చేస్తాడు పూర్వాషాడలో ఉన్నా కూడా పరవాలేదు.
పంచమంలో గురువు ఉత్తర మీద, 11 లో రవి గురువు నక్షత్రం మీద, ఉంటే రవి కుజలు కలిసి లాభంలో ఉంటే, గురువు పంచమంలో ఉండి రవి నక్షత్రం నుంచి చూడటం వలన బాగుంటుంది.
గురువు చంద్రుడు కలిసి దశమంలో ఉంటే బాగుంటుంది. పంచమములో గురుచంద్రులూ కూడా బాగుంటుంది. పంచమంలో రవి గురువులు కలిసి పూర్వాషాడ మీద ఉండటం వలన రవికి దిగ్బలం వస్తుంది. శుక్రుడు చతుర్ధములో దిగ్బలం పొంది గురు నక్షత్రం మీద ఉంటే ఇంకా బాగుంటుంది.
6. కన్యా లగ్నం
కన్య లగ్నానికి బుధుడు లగ్నాధిపతి, పంచమాధిపతి శని, శుక్రుడు తొమ్మిదవ స్థాన అధిపతి, శుక్రుడు బలమైన శుభగ్రహం అవుతూ positive results ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఉదాహరణ: కన్య శుక్రుడికి నీచ క్షేత్రం. బుధ శుక్రులు పరస్పర సమస్తకాలలో ఉండలేరు. బుధుడు శుక్రుడు లగ్న భాగ్యాధిపతులు. లగ్నం మీద కలిస్తే నీచ భంగం అవుతుంది మంచిది.
శని,భుదులు కలిసి ఆరులో ఉన్నారు. శుక్రుడు మీనంలో ఉండి రేవతిలో ఉంటే, బుధుడు అష్టమంలో శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ ఉభయ కేంద్రాధిపతి దుస్థానంలో ఉండవచ్చు అనే రూల్ ఉంది.
లగ్నాధిపతి అష్టమంలో ఉన్నా యోగకారక నక్షత్రంలో ఉంటూ ఉచ్ఛస్థితిని పొంది ఉన్నాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. చతుర్దంలో పూర్వాషాడలో శుక్రనక్షత్రంలో బుధుడు, శుక్రుడు, రవి ఉన్నారు అనుకుందా, .అప్పుడు బాగుంటుంది. రవి శుక్రులు చతుర్దంలో పరివర్తన చెందితే కూడా బాగుంటుంది.
లగ్నంలో రవి గురువులు కలిసి ద్వితీయంలో శుక్రుడు శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడు లగ్నం మీద మరియు ద్వితీయంలో ఉన్నట్టు పనిచేస్తాడు.
శని ద్వితీయంలో కుజ నక్షత్రం మీద ఉంటే కుజుడు, శుక్రుడు, దశమంలో ఉంటే, అష్టమ భాగ్యాధిపతి కలయిక అయినప్పటికీ, కుజుడు దిగ్బలం పొందటం వలన పాపి అయినా కూడా, శని అష్ట షష్ఠాధిపతుల కాంబినేషన్ ఆపరేట్ చేస్తూ యోగ కారకుడై శుక్రుడు కలవడం వలన విశేష యోగం ఉంటుంది
7. తులా లగ్నం
తులా లగ్నానికి మిగతా లగ్నాలు లాగా కాకుండా ఒక విశిష్టత ఉంది. తులా లగ్నానికి కేంద్రాధిపత్యం చాలా ముఖ్యమైనది కేంద్రాలలో ఉన్న గ్రహాలు యోగిస్తాయి. తులా లగ్నానికి బుధుడు మరియు చంద్రుడు యోగ కారకులు.
బుధుడు భాగ్యాధిపతి కాబట్టి శుభగ్రహంగా తీసుకున్నారు చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే యోగిస్తాడు.
ఉదాహరణ: షష్ఠాధిపతి అయిన గురువు వ్యాయాధిపతి అయిన బుధుడితో కలిస్తే విపరీత యోగం. అదే వాళ్ళు చంద్ర నక్షత్రం పైన కలిసి చంద్రుడు పూర్ణచంద్రుడై చతుర్దంలో ఉంటే, దానిని గురువు చూస్తూ ఉంటే, ఇంకా చాలా మంచిది.
8.వృశ్చిక లగ్నం
ఇక్కడ మొత్తం 12 లగ్నాలలో వృశ్చిక లగ్నానికి ముగ్గురు యోగ కారకులను ఇవ్వడం జరిగింది. గురువు, రవి, చంద్రుడు.
ఉదాహరణ: రవి, గురువులు ద్వితీయంలో దశమంలో కుజుడు వృశ్చిక లగ్నానికి మంచి ఫలితాలను ఇస్తాయి.
వృశ్చిక లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉండి లాభంలో రవి కుజులు కలిసి ఉంటే యోగిస్తుంది.
లగ్న దశమాధిపతులు అయినా రవి కుజులు కలిసి లగ్నంలో ఉన్నారు, లగ్నంలో గురువు కూడా ఉన్నాడు, అది కూడా విశేషంగా యోగిస్తుంది.
సప్తమాధిపతి శుక్రుడు లగ్నం మీద శని నక్షత్రంలో ఉంటే, రవి కుజులు లాభంలో ఉండి, గురుచంద్రులు కలిసి తొమ్మిదిలో ఉంటే, గురువు శుక్రుడుని చూస్తూ ఉంటే బాగుంటుంది.
చంద్ర నక్షత్రంలో రవి కుజులు కలిసి చంద్రుడు తొమ్మిదిలో ఉన్న, పదిలో ఉన్న, నాలుగులో ఉన్న, బాగుంటుంది.
9.ధనుర్లగ్నం
ధనుస్సు లగ్నానికి రవి యోగ కారకుడు రవి యొక్క నక్షత్రాల మీద గ్రహాలు ఉంటే విశేషమైన యోగాలను ఇస్తాయి .
ఉదాహరణ: రవి కన్యలో బుధుడితో కలిసి ఉత్తరలో ఉంటే దిగ్బలాన్ని పొందుతాడు. బుధుడు ఉచ్చ పొందుతాడు, ఉచ్చ పొందిన గ్రహమైన దశమాధిపతితో, యోగకారకుడు కలవడం, అదే యోగకారకుడు నక్షత్రంలో బుధుడు ఉండటం, మీనంలో గురువు ఉండి కన్యలో ఉన్న బుధుడిని చూస్తుంటే, చతుర్ధాధిపతి దశమాధిపతి స్వక్షేత్రంలో ఉంటూ పరస్పరం చూసుకుంటున్నారు.
లగ్నాధిపతి గురువు కేంద్ర కోణాధిపతి అవుతాడు. ఆయన చతుర్థములో కేంద్రాధిపత్యం పట్టి, స్వక్షేత్రగతుడై, స్వనక్షత్ర గతుడై, ఉచ్చ పొందిన గ్రహాన్ని యోగకారకుడైన రవి చేత చూడబడుతాడు, కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం పడుతుంది కాబట్టి బాగుంటుంది. కానీ రవికి గురువు వ్యతిరేక రాశిలోకి వెళితే వక్రత్వాన్ని పొందుతాడు. అప్పుడు స్వనక్షత్రం అయితే ఏమి కాదు, వేరే నక్షత్రం అయితే దోషమవుతుంది.
గురువు అష్టమములో బాగుంటాడు. బుధుడు, చంద్రుడు పరివర్తన చెందారు (అష్టమాధిపతి దశమాధిపతి నక్షత్రంలో, దశమాధిపతి అష్టమాధిపతి నక్షత్రములో పరివర్తన చెందారు) అయినా పర్వాలేదు.
ధనుర్ లగ్నానికి లాభములో రవి రాహువుల కాంబినేషన్ బాగుంటుంది. రవి రాహులు తొమ్మిదిలో ఉన్న, రవి స్వక్షేత్ర గతుడై రాహువుని డామినేట్ చేసి రవి రాహుల కొంత వరకే పని చేస్తుంది.
10.మకర లగ్నం
మకర లగ్నానికి బుధుడు మరియు శుక్రుడు యోగ కారకులు. కేంద్ర కోణాధిపతి అయిన శుక్రుడు రాజయోగ కారకుడు. బుధుడు భాగ్యాధిపతి అవ్వడం వలన విశేషమైన యోగకారకత్వం ఉంది.
ఉదాహరణ :శని బుధ నక్షత్రంలో వృశ్చికంలో జేష్ఠలో ఉన్నాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. బుధుడు కూడా అక్కడే శని నక్షత్రంలో లాభంలో ఉన్నాడు, దశమంలో శుక్రుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు.
మకరంలో శని స్వనక్షేత్ర గతుడై, దశమంలో శుక్ర బుధులను చూస్తున్నాడు. అది కూడా యోగమే. సప్తమంలో బుధ నక్షత్రమైన ఆశ్లేషలో బుధుడు శుక్రుడు చంద్రుడు ఉంటే కూడా యోగమే. శని బుధ నక్షత్రంలో ఉండి బుధుడు లగ్నం మీద ఉంటే కూడా బాగుంటుంది.
చతుర్ధంలో రవి బుధుడు కలిసి భరణిలో ఉండి, మీనంలో శుక్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి షష్టమాధిపతితో చేరడం వలన చతుర్ధంలో విపరీత యోగం అయింది .
11.కుంభ లగ్నం
కుంభ లగ్నానికి పంచమ భాగ్యాధిపతి శుక్రుడు, బుధుడు, యోగ కారకులు. శుక్ర, బుధ నక్షత్రాల మీద గ్రహాలు ఉంటే విశేషమైన యోగాన్ని ఇస్తాయి.
ఉదాహరణ: దశమాధిపతి అయిన కుజుడు దశమములో ఉంటే వృశ్చిక మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇక్కడ కుంభంలో రవి, బుధలు బుధ నక్షత్రం మీద ఉండి కుజుడు దశమంలో దిగ్బలం పొంది యోగ కారకుడితో కలిశాడు. పంచమ దశమాధిపతుల కలయికలో సప్తమాధిపతి కలిశాడు. మంచి యోగం, ప్రభుత్వ అధికార యోగం ఉంటుంది.
12.మీన లగ్నం
మీన లగ్నానికి చంద్రుడు ఒక్కడే యోగ కారకుడు. చంద్రుడు చతుర్దంలో దిగ్బలాన్ని పొందుతాడు.
ఉదాహరణ: చతుర్దములో చంద్రుడు బుధుడు కలిసి పునర్వసులో ఉన్నారు. గురువు లగ్నం మీద బుధ నక్షత్రములో ఉన్నాడు. అంటే గురు చంద్రుల పరివర్తన లో చంద్రుడనే యోగ కారకుడు కలిశాడు అంటే అది చాలా మంచి యోగం.
గురువు చంద్రుడు కలిసి పునర్వసులో పంచమంలో ఉన్నారు. కుజుడు తృతీయంలో రోహిణి లో ఉన్నాడు అది బాగుంటుంది. కుజుడు దశమంలో దిగ్భలాన్ని పొంది మిథునములో కుజుడు పునర్వసులో ఉండి గురువు దశమంలో చంద్రుడుతో పాటు కలిసి ఉండి చూస్తుంటే అది విశేష యోగం.
All charts images will be added
Table will be added shortly
ముగింపు :
ఏ లగ్నానికి అయినా గ్రహాలు ఎక్కడ ఉన్నా, ఆ లగ్న సంబంధిత యోగ కారక నక్షత్రాలలో ఉంటూ, యోగ కారకులు శుభస్థానాన్ని పొందితే ఆ జాతకం విశేషం అవుతుంది, ఆ జాతకుడు జీవితం విశేష అభివృద్ధిలోకి వస్తుంది
ఉదాహరణకు : మేష లగ్నానికి కుజుడు దశమ స్థానంలో ఉండి శ్రవణా నక్షత్రంలో ఉంటే, చంద్రుడు చతుర్దంలో పునర్వసు నక్షత్రంలో ఉండి చూసిన, కుజుడు దశమంలో ఉచ్చలో ఉండడం, యోగ కారకుడైన చంద్రుడి నక్షత్రంలో ఉండడం, యోగా కారకుడు స్వక్షేత్రంలో బలంగా ఉండడం, యోగ కారకుడైన చంద్రుడు చేత కుజుడు మళ్ళీ చూడబడడం ఇలా విశేషంగా ఆ రెండు భావాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి.
మరో ఉదాహరణ ఇదే మేష లగ్నానికి శని సప్తమంలో ఉచ్చ పొంది గురు నక్షత్రమైన విశాఖలో ఉంటూ, గురువు స్వక్షేత్రగతుడైన ఉచ్చ పొందిన అప్పుడు కూడా విశేషంగా శని యోగించే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే శని లగ్నానికి పాపి అయినా యోగ కారకుడైన గురు నక్షత్రంలో ఉంటూ యోగ కారకుడు శుభస్థానాన్ని పొందడం వల్ల యోగించడం జరుగుతుంది.
మనం యోగకారక గ్రహాన్ని మరియు యోగాన్ని నిర్ణయించటానికి, ఒకటి ఐదు తొమ్మిది భావాలు, శుభగ్రహాలను, కేంద్ర మరియు కోణాధిపతి అయిన గ్రహాలను, యోగకారక నక్షత్రాధిపతులను, గ్రహాల పరివర్తనను, గ్రహాల కలయికను మరియు గ్రహ దృష్టిలనుపరిగణలోకి తీసుకోవాలి.