ఉపోద్ఘాతం:
లగ్నం ఆధారంగా ఒకటి నుంచి 12 రాశులను లెక్కించే విధానాన్ని భావాలు అని అంటే, అవి మనిషి జీవితంలో ముఖ్యమైన సుఖ దుఃఖాలను తెలియచేస్తున్నాయి.
ఒక జీవి ఏ విషయం గురించే అయితే ఆనందిస్తాడో అదే విషయం గురించి బాధపడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి ప్రేమిస్తే చాలా ఆనందాన్ని ఇస్తుంది, ప్రేమించకపోతే అదే బాధ.
లగ్నం ఆధారంగా లెక్కిస్తే అన్ని భావాలను కొన్ని వర్గాలుగా వర్గీకరించారు వాటి ద్వారా అక్కడ ఏర్పడిన గ్రహ స్థితి ఆధారంగా మనం మరింత మెరుగైన ఫలితాన్ని తెలియజేయవచ్చు.
భావ విభజన :
మన అవసరాన్ని జ్యోతిష్యం ద్వారా ఫలితాలు చెప్పాలంటే భావాలను కూడా రకరకాలుగా విభజిస్తే తప్ప మన ఖచ్చితమైన విషయాన్ని తెలియజేయలేకపోతుంటాం, నాకు తెలిసిన కొన్ని భావ విభజన పద్ధతుల వల్ల జ్యోతిష్య ఫలితంలో ఉపయోగం ఎలా ఉంటుందో తెలియజేస్తాను.
- భావకారకత్వాలు
- కారకో భావన నశయ
- ధర్మ, అర్ధ, కామ, మోక్ష స్థానాలు
- కోణాలు, కేంద్రాలు, ఫణి ఫరాలు, అప్పో కీమాలు
- మారక, భాదక స్థానాలు
- ఉపచయాలు, అపచయాలు
- దుస్థానాలు ( త్రికములు ) విపరీత యోగాలు
- భావాత్ భావం
- ఋణానుబంధం – భావాలు
- ప్రతి భావానికి వ్యయ భావం, ప్రతికూల భావం
- భావానికి షష్టాష్టకాలు
- ఒక భావానికి వ్యయ, ధన భావాల ప్రభావం
- ఒక భావానికి ఇతర భావాల సహాయం
- ఒక సందర్భానికి లో 12 భావాలు చూడగలగడం
- కాలపురుషాంగాలు
పైన పేర్కొన్న విధంగా భావాలను మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే గ్రహాల ఆధారంగా ఫలితాలు చెప్పగలుగుతాం, ఒక బిడ్డ ఎదగడానికి ఆరోగ్యం, తల్లిదండ్రులు, ప్రకృతి, మంచి మిత్రులు, సమాజం, విద్య ఇలా ఎలా సహకరిస్తాయో ప్రతి విషయం జీవితంలో మంచిగా అనుభవించడానికి ఆ భావాన్ని పూర్తిస్థాయిలో పొందడానికి ఎలా ఇతర భావాల నుంచి సహాయం ఉంది అనేది కూడా చూడాలి.
ఈ వ్యాసంలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని మీరు ఫలిత జ్యోతిష్యంలో కచ్చితంగా వాడే విధంగా నేను ఒక అవగాహనను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.
ముందుగా లగ్నం నుండి 12 భావాలకి ఉన్న సహజ కారకత్వలు కొన్ని మీకు చెప్తాను.
భావ కారకత్వాలు :
ఓం
సహజంగా ఉంటే కొన్ని భావ కారకత్వాలు తెలియజేస్తున్నాను, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అదే తత్వాన్ని, శుభప్రదం గాను, ఆ శుభప్రదం గాను నిర్ణయించాల్సింది ఉంటుంది.
ఉదాహరణకి చతుర్దంలో ఒక గ్రహం చూడడానికి చాలా బాగుంది. జన్మించిన కొన్ని రోజులకి ఆ గ్రహం వక్కిరించడమో, గోచారంలో ( ప్రస్తుతం ఖగోళంలో తిరిగే గ్రహాలను జన్మజాతక గ్రహాలతో పరిశీలించే విధానం ) రాహు, కేతు వంటి గ్రహ సంచారం వలన అదే భావం వల్ల జాతకుడు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ కంటితో చూసి ఆ కంటితో వదిలేయండి, వాటంతటావే మీకు అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తాయి. అన్ని లగ్నం ఆధారంగా లగ్నం నుంచి లెక్కించాలి.
1 లగ్నం : తను భావం, శరీరం.
2 ధన స్థానం : కుటుంబం, ధన సంబంధమైనవి.
3. విక్రమ స్తానం : సోదరులు, పట్టుదల, చేతులు.
4. చతుర్ధ స్తానం : తల్లి, ప్రాధమిక విద్య.
5. పంచమ స్తానం : విద్యా , జ్ఞాన స్తానం, సంతానం.
6. షష్టమ స్తానం : శత్రు, రోగ, రుణస్థానం.
7. సప్తమ స్తానం : కళ్లత్రం, భార్య, పార్ట్నర్, వ్యాపారం.
8. అష్టమ స్తానం : ఆయుర్దాయం, శరీరం, ప్రమాదాలు
9. భాగ్య స్తానం : పితృ స్థానం, గురువు, పూర్వ పుణ్యం
10. దశమ స్తానం : కర్మ స్థానం, ఉద్యోగం, వ్యాపారం
11. లాభ స్తానం : సునాయాస ధన లాభం, మిత్రులు
12. వ్యయ స్తానం : వ్యయం, నిద్ర, శయ్య సుఖం
కాలపురుషాంగాలు : మీన రాశులు తల నుండి కాళ్ళ వరకు శరీర భాగాలను తెలియజేస్తాయి. అదేవిధంగా లగ్నం నుండి ద్వాదశ భావం వరకు శరీర భాగాలను చెప్తాయి, నక్షత్రాలు కూడా ఇలానే తెలియజేస్తాయి. నీకు ఆధారంగా శరీరంలో బలమైన అవయవాలు, బలహీనమైన అవయవాలు గుర్తించవచ్చు.
- లగ్నం : ముఖము
- ద్వితీయం : నేత్రాలు, మెడ
- తృతీయం : భుజములు
- చతుర్ధం : చాతి, ఊపిరితిత్తులు
- పంచమం : హృదయం
- షష్టమం : పొట్ట, పొట్టలోని జీర్ణాశయం
- సప్తమం : నాభి, వెన్నుముక
- అస్తమం : మర్మ అవయవాలు
- నవమం : తొడలు, కిడ్నీలు
- దశమం : పిక్కలు
- ఏకాదశం : మోకాళ్ల నుండి పాదాల వరకు
- ద్వాదశం : పాదాలు
భావకారకులు
- లగ్నం : రవి ఆరోగ్య కారకుడు
- ద్వితీయం : గురుడు ధన కారకుడు
- తృతీయం : కుజుడు బాత్రు కారకుడు
- చతుర్ధం : చంద్రుడు మాతృ కారకుడు
- పంచమం : గురుడు పుత్రకారకుడు
- షష్టమం : కుజుడు వాహన కారకుడు
- సప్తమం : శుక్రుడు కళత్ర కారకుడు
- అస్తమం : శని ఆయు: కారకుడు
- నవమం : రవి పితృ కారకుడు
- దశమం : రవి ఉద్యోగ కారకుడు
- ఏకాదశం : గురుడు లాభాలకు అధిపతి
- ద్వాదశం : శని
ఒక భావాన్ని పరిశీలించినప్పుడు ఆ బావాధిపతి, భావము బాగున్నప్పటికీ భావకారకుడు బాగోనప్పుడు దానికి సంబంధిత దశలు జరుగుతున్న ఆ భావం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకే బావాధిపతి, భావకారకుడు ముఖ్యము మరియు కాలానికి సంబంధించి దశ మరియు భుక్తి అధిపతులు
( వారి నక్షత్రాధిపతులు ) ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తారు.
కారకో భావ :
సాంప్రదాయ జ్యోతిష్యంలో కారకులు సంబంధిత రాశుల్లో ఉంటే భావము ఇబ్బంది పడుతుందని వివరించారు, అయితే దీన్ని యధాతధంగా అనుసరించలేము, పంచమ స్థానంలో గురువు ఉన్నంత మాత్రాన పిల్లలు కలగకుండా ఉండరు. సప్తమంలో శుక్రుడు ఉన్నంత మాత్రాన వివాహం జరగడం ఆగదు. కాబట్టి రాశ్యాదిపతిని, ఆ రాశిలో బలమైన గ్రహం యొక్క నక్షత్రాధిపతిని, దశనాధుని ఇలా చాలా విషయాలు పరిశీలించి నిర్ణయించాల్సింది ఉంటుంది.
మరి కొన్ని భావ కరకత్వాలు:
List from the book
ధర్మ, అర్ధ, కామ, మోక్ష స్థానాలు :
ఈ విషయాన్ని సంక్షిప్తంగా మన వాడుక భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మనకు అర్థమైతేనే ప్రతి జాతక చక్రంలో పరిశీలన సులువు అవుతుంది.
ధర్మస్థానాలు : 1, 5, 9
అర్థస్థానాలు : 2, 6, 10
కామస్థానాలు : 3, 7, 11
మోక్షస్థానాలు : 4, 8, 12
ధర్మస్థానం ఒకటైతే, అర్థస్థానం రెండు, కామస్థానం మూడు, మోక్ష స్థానం నాలుగు, దీనిని ఇలానే అనుకరిస్తు మిగిలిన రాశులకు ఆపాదించాలి. అన్ని పక్కపక్కనే ఉన్నాయి కదా, అందుకే ఈ వరుసలో గుర్తుపెట్టుకోవడం కూడా సులువు.
ధర్మస్థానాలు : ధర్మో రక్షిత రక్షితః, అంటే ఏం లేదు మనం ఎదుటి వాళ్లు పట్ల బాగుంటే, వాళ్లు మన పట్ల బావుండే అవకాశం ఉంటుంది, మనం కొడితే వాళ్లు తిరిగి కొడతారు. మనం సమాజంలో అందరం కలిసి బతుకుతున్నప్పుడు, ప్రకృతికి మనం ఇస్తే అదే తిరిగి ఇస్తుంది అర్థం చేసుకొని బతకడమే. ఈ స్థానాలలో గ్రహాలు సరైన విధంగా ఉన్నప్పుడు ఆ జాతకుడు ధర్మవంతుడు అవుతాడు.
అర్థ స్థానాలు : మనిషి మనుగడకు మరక ద్రవ్యం లేనిదే జానెడు పొట్ట నిండదు. ప్రతి మనిషి తనకి,నచ్చిన, నచ్చకపోయినా శక్తి కొద్ది పని చేస్తేనే దానం దొరుకుతుంది. అర్థం స్థానాలు ఆ వ్యక్తి ఎంత సమృద్ధిగా డబ్బు పొందగలుగుతాడు, అనేది తెలియజేస్తాయి.
కామ స్థానాలు : కామం అంటే కోరిక అని అర్థం, రుచికరమైన భోజనం తినాలనుకోవడం మొదలు, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మంచి కారు కొనుక్కోవాలి అనుకోవడం, మంచి ఇల్లు కట్టుకోవడం. ఎప్పుడైతే ఈ స్థానాలలో గ్రహాలు అనుకూలిస్తాయో అన్ని రకాల సుఖాలను పొందే అవకాశం ఉంటుంది.
మోక్షస్థానాలు : మోక్షం, మోక్షజ్ఞానం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక గోడ ఎక్కితే అటువైపు ఎంత లోతు ఉన్నది అనేది అర్థమవుతుంది, ఎక్కని వాడికి ఆ లోతు గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేడు, ఇది కూడా అలాంటిదే.
కోరికలు అన్ని అనుభవించేసి, ఏది అవసరంలేని స్థితిలో మోక్షాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది.
ఈ నాలుగింటిని రెండు భాగాలుగా విభజించవచ్చు, అర్ధాన్ని కామానికి, ధర్మాన్ని మోక్షానికి కలిపేయవచ్చు. దీనినే materialistic & spiritual అని అనవచ్చు.
Materialistic Combinations: ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో materialistic కాంబినేషన్స్ ఉంటే ఆ వ్యక్తి అదే విషయంలో ఏ అడ్డంకి లేకుండా ముందుకు వెళ్లిపోతాడు. కుజ, శుక్ర, రాహు వంటి గ్రహాలు ఈ స్థానాలకు ఆ జాతక చక్రంలో సంబంధాన్ని కలిగి ఉంటూ ఉంటాయి.
Spiritual Combinations: ఒక జాతకుడికి కేవలం స్పిరిచువల్ కాంబినేషన్స్ మాత్రమే ఉంటే ఏ గొడవ లేకుండా అదే విషయంలో పురోగతిని సాధిస్తాడు. శని, గురు, కేతు గ్రహాలు ఆ స్థానాలకి సంబంధాన్ని కలిగి ఉంటాయి.
పెద్ద చిక్కేంటంటే ఈ రెండు spiritual and materialistic కాంబినేషన్స్ ఒకే జాతకంలో ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి ఒక్క కోరికను తీర్చుకోవడానికి ఏదో ఒక అడ్డంకి కలుగుతూనే ఉంటుంది.
ప్రతి వ్యక్తి కర్మను అనుభవించడానికి పుడుతూ, ఎంతో కొంత పూర్వ జన్మలో మోక్ష సాధనను చేసి ఉంటాడు. భక్తి, దైవం పై నమ్మకం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కలుగుతాయి, ఆ వ్యక్తి యొక్క స్పిరిచ్యువల్ అభివృద్ధికి కష్టాలు తోడ్పడుతూ, ఆ విషయంపై విషయాసక్తి తగ్గాక ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలల్సి ఉంటుంది.
అంటే కుజ శుక్రుల సంబంధాలను, శని గురుకేతుల సంబంధాలను, కామ మోక్ష స్థానాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
కేంద్రాలు, కోణాలు, ఫణి ఫరాలు, అప్పోక్లిమాలు :
కేంద్ర స్తానాలు : 1, 4, 7, 10 వీటిని కేంద్ర స్తానాలంటారు. ఏ విషయమైనా పట్టుదలగా సాధించాలంటే ఈ కేంద్రాలు బలంగా ఉండాలి.
కేంద్రాల యొక్క ప్రాముఖ్యత ఒక చిన్న ఉదాహరణతో మీకు వివరిస్తాను. లగ్నం ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తన సామర్థ్యంతో ( చదువు, జ్ఞానం ) ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ ఉద్యోగం దశమ స్థానం నుంచి పరిశీలించాలి. సరైన ఉద్యోగం వల్ల వ్యక్తి వివాహం చేసుకోవడానికి సుముఖంగా ఉంటాడు. ఈ వివాహం సప్తమ స్థానం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. వివాహం తర్వాత జీవిత స్థిరత్వానికై గృహము వంటిది ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు, ఇది చతుర్ధ స్థానం నుంచి పరిశీలిస్తారు.
ఈ విధంగా జాతకుడికి ప్రాథమిక కనీస సుఖాలు ఈ కేంద్ర స్థానాలు తెలియజేస్తాయి, కేంద్ర స్థానాలు సరిగా లేనట్లయితే ఆ వ్యక్తి జీవితంలో కష్టపడి సాధించడం అనేది సందేహమే.
కోణ స్తానాలు : లగ్నం నుండి 1, 5, 9 స్థానాలను కోన స్థానాలని అంటారు. ఇది సహజంగా అదృష్టాన్ని తెలియజేస్తాయి. కోణాధిపతులు, కోణ స్థానాలు శుభప్రదమైన ఆ జాతకుడు అదృష్టవంతుడు. ఎందుకంటే తొమ్మిదవ స్థానం గత జన్మ పూర్వపుణ్యాన్ని, పంచమ స్థానం గత జన్మ అంటే ముందు జన్మలో చేసుకున్న పూర్వ పుణ్యాన్ని తెలియజేస్తుంది. లగ్నం ప్రస్తుత జన్మన తెలియజేస్తుంది. లగ్నం యొక్క మరో విశేషము అది కేంద్రము, కోణము అవ్వడం.
ఒక సినిమాలో చాలా పాపులర్ డైలాగ్ ఏంటంటే ఎవడి తో అయినా పెట్టుకోవచ్చు గానీ అదృష్టవంతుడితో పెట్టుకోలేము. ఎందుకంటే వాడికి అన్నీ అనుకూలంగానే జరుగుతాయి.
రాజయోగం : ఎప్పుడైతే కేంద్ర స్థానాలు, కోణ స్థానాల సంబంధాన్ని పొందుతాయో అది రాజయోగం అవుతుంది. కేంద్రాలు కష్టాన్ని తెలియజేస్తే, కోణస్థానాలు పూర్వకర్మ అదృష్టాన్ని తెలియజేస్తాయి.
ఎప్పుడైతే కేంద్ర కోణాధిపతులు కేంద్రాధిపత్యం పడితే, ఆ జాతకుడు చేసిన కష్టానికి ఎక్కువ రేట్లు ఫలితాన్ని అదృష్టం వల్ల పొందుతాడు.
అదే కేంద్ర కోణాధిపతులు కోణ స్థానంలో కలిసిన కేవలం అదృష్టం వల్ల అభివృద్ధిలోకి వస్తాడు. ఈ సందర్భంలో కష్టం కన్నా జీవితం అదృష్టంతో సాగిపోతూ ఉంటుంది.
ఫణిఫర స్థానాలు : (2, 5, 8, 11) prevention houses ఇవి, కేంద్ర స్థానాలకు పక్కన, అపో క్లిమస్థానాలకి ముందుగా ఉండే స్థానాలను పని పరస్థానాలు అని అంటారు. ఇది ఒక రోగం వచ్చే ముందు జాగ్రత్త ఎలా తీసుకుంటారో అలా జాగ్రత్తను ఈ స్థానాలు తెలియజేస్తాయి.
లగ్నం సామర్థ్యాన్ని తెలియజేస్తే, ద్వితీయం సామర్థ్యం వల్ల వచ్చే ధనాన్ని తెలియజేస్తుంది. తృతీయం అష్టమాత్ అష్టమము అయితే ఆ సమస్య నుంచి కాపాడడానికి ద్వితీయము సహాయపడుతుంది. రెండు నోరు అయితే, మూడు ఊరు అవుతుంది. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కదా, అలా అన్నమాట.
ఒక భావానికి వ్యయ, ధన భావాల ప్రభావం :
ఒక విషయాన్ని మనం సరిగ్గా గమనిస్తే లగ్నం నుంచి ద్వితీయము దాని అభివృద్ధి, తృతీయానికి ద్వితీయము కాపాడడం. తృతీయంలో సమస్య వస్తే, ద్వితీయం సరిగా లేకుంటే ఆ సమస్య మరింత పెద్దగా అవడం. ఇలా ప్రతి రాసి ముందు తర్వాత రాశుల్లో, ప్రతి నక్షత్రం ముందు తర్వాత నక్షత్రాలలో అనుకూలత, ప్రతికూలత ప్రభావాలను మనం పరిశీలించవచ్చు.
చతుర్ధ కేంద్రం ఇల్లు అయితే ఇలాంటి స్థిరాస్తులను పంచమమైన పిల్లల కోసం దాయడం సహజం. అలాగే ఆరు రోగస్థానం అయితే, రోగాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా పంచమస్థానమే అవుతుంది.
సప్తమ స్థానం కళత్ర స్థానం అయితే, ఎనిమిదవ స్థానము, దాని నుంచి రెండవ స్థానం అవ్వడం వల్ల భార్య యొక్క ధనము, వరకట్నం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆయుర్దాయము ఇలాంటి విషయాలను తెలియజేస్తుంది. తొమ్మిదవ స్థానము భాగ్యస్థానము కావడం వల్ల, ప్రమాదాల భారీ పడకుండా ఉంటే మన భాగ్యము కాపాడబడుతుంది.
ఉద్యోగం ద్వారా వచ్చిన సంపద ఏకాదశంగా సూచించవచ్చు, ద్వాదశము ఖర్చు అయితే అది జాగ్రత్తగా ఉంటే ఏకాదశము మనకి మిగులుతుంది. అదేం లేదండి అనవసరపు ఖర్చులు లేకపోతే మన డబ్బులు సేఫ్.
ఒక వ్యక్తి యొక్క జాగ్రత్త ఏ విధంగా ఉందని ఈ ఫణిఫరాల నుంచి మనం విశ్లేషణ చేయడానికి ప్రయత్నించవచ్చు.
అపోక్లిమ స్థానాలు : (3, 6, 9, 12): ఈ స్థానాలు ఒడిదుడుకులు, అనిశ్చితులు లేదా సవాళ్లతో కూడిన జీవన ప్రాంతాలను సూచిస్తాయి. ఈ స్థానాలు సహజంగా ఖర్చు చూపిస్తాయి, రోగాల ద్వారా ఖర్చవచ్చు, నష్టాల ద్వారా అవొచ్చు, పూర్వ పుణ్యాన్ని కూడా ఖర్చు చేయాల్సింది ఉంటుంది, తృతీయం విపత్తును సూచిస్తుంది.
ఇలా అన్ని గ్రహాలు, దశకు ఏ విధంగా ఏ భావాలతో సంబంధాన్ని వచ్చాయనేది జాగ్రత్తగా పరిశీలిస్తూ, జరిగిన ఫలితాలను గమనిస్తూ భవిష్యత్తును అంచనా వేయాల్సి ఉంటుంది.
మారక స్థానాలు : ఏ లగ్నానికైనా 2, 7 స్థానాలను మారక స్థానాలని పిలుస్తారు, దీనికి చతుర్దముతోను, బాధక స్థానంతోనే సంబంధం ఏర్పడిన ఆ వ్యక్తి ఇక భూమిపై కనబడడు.
భాధక స్థానాలు : లగ్నాలను మూడు రకాలుగా విభజించారు, అవి చర, స్థిర, ద్విస్వభావ లగ్నాలు ( వరుసగా మేషం, వృషభం, మిధునం, ఇలా మూడు మూడుగా పరిగణలకు తీసుకోవాలి )
బాధక స్థానం అనేది శారీరక కష్టాన్ని తెలియజేస్తుంది, ఒక జీవి తన శరీరం నుంచి ప్రాణం బయటికి వెళ్లేటప్పుడు విపరీత యాతనను అనుభవించాల్సి ఉంటుంది. దానిని బాధక స్థానం నుంచి పరిశీలించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రోగం వచ్చినప్పుడు, మరికొన్ని సందర్భాలలో సందర్భాన్ని ఎదుర్కొనే కష్టం. కొంతమంది అభిప్రాయం ఇది కేవలం ఆరోగ్య విషయాల్లోనే పరిశీలించాలి.
చర లగ్నాలకు ఏకాదశం, స్థిర లగ్నాలకు భాగ్యస్థానం, ద్విస్వభావ లగ్నాలకు సప్తమ స్థానం బాధక స్థానాలు అవుతున్నాయి.
ఉపచయాలు, అపచయాలు :
మీ ఇల్లు ఎక్కడ అంటే, మా అంకుల్ వాళ్ళ ఇంటి పక్కన, మరి అంకుల్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే మా ఇంటి పక్కనే అమ్మో….. ఇలానే ఉంది ఉపచయ అపచయ స్థానాల కథ.
ఉపచయ స్తానాలు : పాప గ్రహాలు ఉపచయ స్థానాల్లో ఉంటే ఆ వ్యక్తికి పోరాటంతో సాధించుకోగలిగే శక్తి ఉంటుంది. ఈ స్థానాల్లో ఉన్న గ్రహాల వల్ల జీవితంలో జాతకుడు వయసు పెరిగే కొద్దీ పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది.
ఇది ఎలా అనేది మనం లాజికల్ గా పరిశీలిస్తే చాలా అద్భుతంగా జాతక విశ్లేషణలో ఉపయోగపడుతుంది.
తృతీయ స్థానం : సామర్థ్యం, గట్టి ప్రయత్నం, విక్రమ క్షేత్రం, సహకారం వంటి విషయాలను సూచిస్తాయి.
షష్ట స్థానం : శత్రు రోగ రుణ స్థానం, పోరాటము, సమస్యను ఆలోచనతో ఎదురుకోవడంతో విజయం సాధిస్తాం.
దశమ స్థానం : కర్మ స్థానం, రాజ్యస్థానం, అధికారం, ఉద్యోగం, పనిచేయ కలిగే శక్తి, జ్ఞానం కలిగి ఉండడం.
ఏకాదశం : సునాయాసమైన లాభాన్ని పొందడం.
ఇప్పుడు ముఖ్యమైన పరిశీలన చేద్దాం. మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి, ఇతర వ్యక్తితో సంబంధం లేకుండా బతకడం అసాధ్యం. మన జాతకం లగ్నాన్ని సూచిస్తే, సప్తమ స్థానం సమాజాన్ని, ఎదుటి వ్యక్తిని సూచిస్తుంది.
తృతీయ స్థానంలో పాపగ్రహం గురించి మాట్లాడుకుంటే మనం పోరాటంతో సాధిస్తున్నామంటే, అది ఎదుటి వ్యక్తి జాతకంలో భాగ్యస్థానంలో ఉన్న పాప గ్రహం లాగా పని చేస్తుంది. మన పట్టుదల ప్రయత్నంతో ఎదుటివాడి భాగ్యాన్ని కొల్లగొట్టొచ్చు. మన కష్టానికి ఎదుటి వాళ్ళు ఇచ్చే ప్రతిఫలం.
ఒక చిన్న ఉదాహరణ మీరు నడవలేక ఒక ఆటో ఎక్కి 20 రూపాయలు ఇస్తే మీ భాగ్యంలో కొంత పోతుంది. వాడి సామర్థ్యంతో కొంత సంపాదించుకోగలుగుతాడు.
ఆరవ స్థానం మనకి పోరాట స్థానం అయితే, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయితే, అది ఎదుటివాడికి (పనివాళ్ళు) వ్యయ స్థానంగా పనిచేస్తుంది.
మనకి లాభ స్థానంలో పాప గ్రహం ఉంటే, ఎదుటివారికి పంచ మనలో ఉన్న పాప గ్రహం వల్ల సునాయాసంగా ఖర్చు పెట్టుకునే మనస్తత్వం ఉన్నవాళ్లు దొరికి, ఎక్కువ ధనార్జన పొందే అవకాశం ఉంటుంది.
దశమం విజయ స్థానం, చతుర్ధం సుఖస్థానం, ఎదుటివాళ్ళు వాళ్లు సుఖాన్ని పొందడానికి మనల్ని ఉద్యోగులుగా తీసుకొని వాళ్ళ అభివృద్ధి చెందుతూ మనకి కొంత ధనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక పెద్ద కంపెనీకి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, దాన్ని నిర్మించడానికి వాళ్లకి ఎంతోమంది వ్యక్తుల సహాయం కావాలి. అది చతుర్ధమైతే, దానికి సప్తమంలో ఉన్న మనమందరం ఆ కంపెనీలో ఉద్యోగులమవుతాం. అదే మనకి దశమంలో బలమైన పాప గ్రహాలలో రవి కుజ కేతు వంటి గ్రహాలు ఉంటే మనకి విశేషమైన అధికారం వల్ల ధన లాభం కలుగుతుంది.
అపచయ స్తానాలు : ఉపచయాలు కాని స్థానాలే అపచయ స్థానాలు అవుతాయి. అవి వరుసగా 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలు. ఇవి వ్యక్తి చరమ దశలో ఉపయోగపడతాయి. ఇవన్నీ ఈ జన్మలో అనుభవించాలి. ఎందుకంటే ఇవి ఏవీ శాస్వతం కాదు కనుక.
దుస్థానాలు ( త్రికములు ) విపరీత యోగాలు :
6, 8, 12 స్థానాలను దుస్థాని, త్రికములని పిలుస్తుంటారు.
జన్మ జాతకంలో భాగ్య స్థానం పూర్వజన్మను, తొమ్మిది నుండి పదవ స్థానము, ఈ జన్మ లగ్నాత్తు ఆరవ స్థానం అవుతుంది. పూర్వకర్మ ఆధారంగా అదృష్టము, రోగము, ఉద్యోగం, శత్రువులు, రుణాలు, రుణానుబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
అష్టమం ఆయుర్దాయ స్థానం, వ్యయము మరొక దుస్థానం. ఇక్కడ (6, 8, 12 ) ఉన్న గ్రహాలు సహజంగా అశుభ ఫలితాలను ఇస్తాయి.
కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఊహించలేనన్ని శుభ ఫలితాన్ని ఇస్తానాల వల్ల జాతకుడు పొంది, ఎవరు ఊహించలేనంత గొప్ప స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఈ స్థానాల వల్ల విపరీత యోగాలు ఏర్పడతాయి.
విపరీత యోగాలు : ఆరవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉండడం కానీ, మరియొక త్రిక స్థానమైన ఎనిమిదవ స్థానంలో గాని, పన్నెండవ స్థానంలో గాని ఉంటే దానినే విపరీత యోగం అంటారు. ఇతర స్థానాధిపతులకు ఇదే సూత్రం ఆపాదింపబడుతుంది.
ఆరవ స్థానము పూర్వకర్మ స్థానం అది శుభప్రదమైన విశేష ధన లాభం జరుగుతుంది, షష్ఠాధిపతి స్వక్షేత్రగతుడైన పూర్వకర్మ దోషం లేనందు వల్ల ఈ జన్మలో ఎటువంటి రోగము లేక అభివృద్ధిని పొందగలరు.
అలాగే అష్టమ, వ్యాయాదిపతులు స్వక్షేత్రగతులైన ఆయుర్దాయము, పెట్టుబడుల నుంచి లాభము పొందగలుగుతాడు. ఈ 6, 8,12 స్తానాధిపతుల పరివర్తన యోగముల వలన ఆ స్థానాధిపతుల మధ్య ఒక బలమైన సంబంధం కలిగి ఆ భావాలను మరింత గొప్పగా అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే కొన్ని సందర్భాలలో విపరీత యోగాలలో యోగయోగ కారకుల సంబంధం వలన అవి అఖండంగా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి.
భావాత్ భావం :
లగ్నం నుండి ప్రతి భావానికి ఏదో ఒక స్థానాన్ని పరిశీలిస్తాం. లగ్నం నుంచి ప్రతిభావానికి వెళ్లడానికి కొంత దూరం దాటాలి. ఎంత దూరం అయితే ఒక భావాన్ని పరిశీలించడానికి తీసుకున్నామో ఆ భావం నుంచి మళ్లీ అంతే దూరం లెక్కిస్తూ ఆ భావాన్ని పరిశీలించడానికి బావతో బావ అంటారు.
సంతానం కోసం పంచమ స్థానాన్ని పరిశీలించడం ఒక ఆచారం. మళ్లీ పంచమ స్థానం నుంచి పంచమ స్థానం. భాగ్య స్థానం అవుతుంది. పంచమ భాగ్య స్థానాలు పరిశీలించి సంతాన విషయాలను చెప్తుంటారు. ఇలాగే అన్ని భావాలకు పరిశీలిస్తుంటారు.
ఆరవ స్థానం రోగస్థానం కనుక, 6 నుండి ఆరవ స్థానం 11వ స్థానం అవుతుంది. ఎప్పుడైతే దశానాధుడు ఇలా ఆరు 11 సంబంధాలను కలిగి ఉంటాడు, ఆ వ్యక్తికి రోగం వచ్చిన సందర్భంలో రోగం తగ్గడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిందే ఉంటుంది. మంచి ఉదాహరణగా ధనుర్ లగ్నానికి శుక్రుడ్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఆరవ స్థానము ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులని సూచిస్తుంది, 11వ స్థానము ఇంట్లో పెంచుకోలేని, పెరట్లో పెంచుకునే, ఆవులు, గేదలు వంటి విషయాలను సూచిస్తుంది. ఇలా అవసరాన్ని బట్టి అనేక రకాలుగా వాడడం చాలా సహజం.
అయితే ఇది సాంప్రదాయ జ్యోతిషంలో ఒక చిన్న పద్ధతి మాత్రమే, మనం నక్షత్ర జ్యోతిష్యం వాడుతున్నాం కనుక ఇదంతా చూడాల్సిన అవసరం అంటూ లేదు. ఇలాంటి ఒకటి ఉందని తెలుసుకుంటే సరిపోతుంది.
భావానికి షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు :
సంప్రదాయ జ్యోతిషంలో ఒక గ్రహానికి గాని, భావాధిపతి నుండి ఆరవ లేక అష్టమ స్థానంలో మరో పాప గ్రహం ఉంటే అది ఈ గ్రహంపై ఇబ్బంది పెడుతుందని పరిగణిస్తారు, దానివల్ల ఆ రెండిటి గ్రహల దశ అంతరాలలో చెడు ఫలితాలు ఇస్తాయని చెప్పారు.
ఏ గ్రహాల మధ్య షష్ఠాష్టకము ఉన్న అది దోషంగా, కానీ శని కుజల మధ్య షష్ఠాష్టక దోషమును శుభప్రదముగా పరిగణిస్తారు. దీనిలో కుజ గ్రహము నుంచి శని ఆరవ స్థానంలో ఉండడం గొప్ప విశేషం అవుతుంది.
ఇదేవిధంగా ఒక గ్రహానికి ఇరువైపులా పాప గ్రహాలు రెండు మరియు పన్నెండు స్థానాలలో ఉంటే ఆ యొక్క గ్రహం పాపార్గణంలో ఉందని పరిగణించి ఆ గ్రహము అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వదని నిర్ణయిస్తారు.
పాశ్చత్య జ్యోతిష్యంలో ఒక గ్రహం యొక్క పురోగమనాన్ని పరిగణలోకి తీసుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్తారు, అది ఎలా అంటే పుట్టినప్పుడు మేషంలో రవి 10 డిగ్రీలకు, మకరంలో శని 10 డిగ్రీలకు ఉన్న, ఆ వ్యక్తి 30 సంవత్సరాలు వచ్చేసరికి రవిని వృషభంలో 10 డిగ్రీల్లో ఉన్నట్టు ఊహించి ఈ రెండు గ్రహాల మధ్య 120 డిగ్రీల కోనస్థితి కలిగినందున ఆ జాతకుడికి ఆ సంవత్సరాన శుభ ఫలితాలు జరుగుతాయి అని చెబుతారు.
ఇదే విషయాన్ని సాంప్రదాయ జ్యోతిష్యంలో, షష్ఠాష్టకం పొందిన గ్రహాలు, దిత్వాదశం పట్టిన గ్రహాలు, ఆ యొక్క గ్రహానికి కొన్ని రోజుల తర్వాత 180 లేక 0 దూరంలోకి వెళ్లి ఆశుభ ఫలితాలని కలగజేస్తాయి. కానీ కుజుడు శనికి అష్టమంలో ఉంటే కొన్ని రోజుల తర్వాత కుజుడు మాత్రమే ముందుకు వెళ్లి 120 డిగ్రీల కోనస్థితిని ఏర్పరచడం వల్ల జాతకుడు 45 సంవత్సరాల వయసు నాటికి శక్తివంతుడిగా అనుకున్నది సాధించే ప్రయత్నం ధైర్యం కలిగి జీవిస్తాడు.
ప్రస్తుతానికి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ముందు రాబోయే పాశ్చాత్య జ్యోతిష్యం చదివే నాటికి మీకు ఇదంతా నల్లేరు మీద నడకే.
ఒక భావానికి ఇతర భావాల సహాయకారం :
Supporting houses అంటే సాధారణంగా సప్తమం వివాహ స్థానం అవుతుంది. ఆ సప్తమ స్థానానికి పంచమ, నవమ స్థానాలు బాగున్నట్టయితే దానిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే అవి ఆ భావానికి పూర్వ పుణ్య స్థానాలు కాబట్టి. సప్తమ కోణాలు అన్నీ కలిపి కామస్థానాలు కూడా అవుతాయి.
తృతీయము వివాహాన్ని ఎదుర్కొని, మాట్లాడి తాంబూలాలు పుచ్చుకునే దానికి కారణం అవుతుంది. సప్తమము వైవాహిక జీవితము, సౌఖ్యము.
సప్తమము నుంచి పంచమ స్థానమైన లాభ స్థానమే భార్య వల్ల కలిగే సంతానము, సంతోషాలను తెలియజేస్తుంది.
ఇక మిగిలిన తొమ్మిది భావాలు ఏదో ఒక రకంగా వివాహాన్ని నిలబెట్టే దానికి కారణం అవుతాయి.
ఈ విధంగా ప్రతి భావానికి ముఖ్యమైన భావాలతో పాటు తోడ్పడే భావాలు కూడా ఉంటాయి.
ఒక సందర్భానికి లో 12 భావాలు చూడగలగడం :
వివాహమనే సందర్భంలో సప్తపము ముఖ్యస్థానం అవుతుంది.
- జాతకుడి ఆరోగ్యం
- కుటుంబ సౌఖ్యం
- కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం
- స్థిరత్వానికి కావలసిన గృహం
- సంతానం, రోగాల భారీ పడకుండా జాగ్రత్త
- రోగాలు, సమస్యలు, పరిష్కారం
- భార్య ఆరోగ్యం, ఇరువైపు కుటుంబాలను స్తంబాలించడం
- భార్య ధనం, ఆకస్మిక ధనప్రాప్తి, జాతకుడు ఆయుర్దాయం
- స్థిరాస్తి, భాగ్యం, పుణ్యం, అదృష్టం
- జాతకుడి ఉద్యోగం, కుటుంబ జీవనానికి ఆధారం
- సంతాన సౌఖ్యం, వైవాహిక సంతోషం
- శయ్యా సుఖము, ఖర్చుల యందు జాగ్రత్త
ఇలా ఒక ఉదాహరణ చెప్పాను, మీరు ప్రతి సందర్భంలోనూ నవగ్రహాలను, ద్వాదశ భావాలను, నక్షత్రాలను, రాశులను ఊహించాల్సిందే ఉంటుంది.
మీకు ఒక చిన్న హోం వర్క్ ఇస్తాను ప్రయత్నం చేయండి. మనందరం ఇష్టపడి తాగే ఒక టీ ( Tea ☕ ) గురించి నవగ్రహాలు ఎలా ప్రభావం చూపయో చెప్పండి.
ప్రతి భావానికి వ్యయ భావం, ప్రతికూల భావం :
Astrologer Shri KS Krishna Murthy garu – Author of KP System. చాలా అద్భుతంగా ఎంతో చక్కగా వివరించారు.
ఏ భావం కోసమైతే పరిశీలిస్తున్నామో అప్పుడు దానికి వ్యయ భావము దశ మరియు భుక్తి నాథులు తెలియజేసిన ఆ విషయం జరగడం చాలా కష్టమవుతుంది.
ఒక ఉదాహరణ చెప్తాను, కర్కాటక లగ్నానికి సంతానం విషయమై పరిశీలిస్తే దశానాథుడు 5, 11 భావాలకు అనుకూలంగా ఉంటే, సంతానయోగం బాగుంటే సంతానం సునాయాసంగా కలుగుతుంది. అదే ఒకవేళ శుక్ర దశ వచ్చినా 4, 11 అధిపతి అవ్వడం వలన ఇలా జరుగుతుంది. ఇదే ఉదాహరణలో శుక్రుడు కర్కాటక లగ్నానికి 11వ స్థానంలో ఉంటూ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉంటూ చంద్రుడుతో కలిసి కేవలం బాధక స్థానం అయిన 11 మాత్రమే సూచించడం, ఆయన స్వయంగా చతుర్థాధిపతి అవ్వడం వల్ల, పంచమము నుంచి 12వ భావము చతుర్ధం అవ్వడం వలన సంతాన ఫలితం ఇవ్వడానికి చాలా కష్టపడతాడు.
ఇదేవిధంగా ఇల్లు కట్టడానికి 4కి బదులుగా 3వ భావము చూపించిన, విద్యకు 9కి బదులుగా 8వ భాగము చూపించిన ఇబ్బందులు తప్పవు.
ఇక్కడ కొన్ని సందర్భాలలో సింహ లగ్నం చూస్తే 6, 7 వ శని అయినంత మాత్రాన వివాహం ఇవ్వడు అని అనుకోకూడదు.
ఋణానుబంధం – భావాలు
ప్రపంచంలో ప్రతి బంధం, ఋణనుబంధం వలన ఏర్పడుతుంది. ఏదో ఒక జన్మ కర్మఫలం వలన మనం ఎదుటివారికి ఇవ్వడమో, తీసుకోవడమో జరుగుతుంది.
జీవితం రైలు ప్రయాణం లాంటిది. ఎవరి ఊర వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్లిపోవడం, అప్పటివరకు నవ్వుతూ మాట్లాడదాం, కొత్త వాళ్ళు ఎక్కడ ఇదంతా చాలా చాలా సహజం.
నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను వానితో ఎవరు ఎవరితో ఎంతకాలం కలిసి ఉంటారో మీరు సుమాయాసంగా ఫలిత నిర్ణయం చేయగలుగుతారు, అలాగే ఒక విషయం జరిగితే అది ఏ భావానికి సంబంధించింది, దాని కారణంగా మరో విషయం జాతకం ఆధారం లేకుండానే ఎలా చెప్పచ్చు అనేది మీకు వచ్చేస్తుంది. ఇది మీరు బాగా ప్రయత్నం చేస్తే పిచ్చి కూడా పట్టొచ్చు నన్ను మాత్రం ఏమనదు. :p 😁
ఉదాహరణ 1 :
మా ఇంటి దగ్గర ఇద్దరు ఇద్దరు కవలలు ఉన్నారు, పెద్ద ఆయన అన్న మరియు తమ్ముడు. పెద్ద అన్నయ్య ఇల్లు నిర్మాణం చేస్తున్నాడు, కానీ తమ్ముడు తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. దురదృష్టవశాత్తు, తమ్ముడు మరణించాడు.
ఈ విషాద సంఘటన తమ్ముడిని 3వ భావం (అన్నయ్య జాతకంలో) negatively activate చేసింది. ఫలితంగా, అన్నయ్య తన ఇల్లు నిర్మాణాన్ని నిలిపివేయవలసి వచ్చింది ( సరైన ధనం లేక ) , 3వ భావం Activation ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఇది చూపిస్తుంది.
ఈ విధంగా నాలుగవ భావానికి వ్యయ భావము అయిన మూడవ భావం వల్ల నాలుగవ భావానికి దోషం ఏర్పడినది.
ఉదాహరణ 2
ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేశారు, ప్రచార సమయంలో, నాయకుడి యొక్క తల్లి మరణించారు. ఈ సంఘటనలో రాజకీయ నాయకుడు యొక్క 4వ భావం (తల్లి మరియు గృహ శాంతి) negatively activate చేసింది. ఫలితంగా, ఈ negative activation వల్ల ఆ నాయకుడు జరిగిన ఎన్నికల్లో పరాజయం జరిగింది.
4వ భావం కుర్చి, సింహాసనం, వంటి విషయాలు తెలియజేస్తుంది.
ఉదాహరణ 3
మీ ఇంట్లో ఒక కుర్చీకి ఒక కాలి విరిగిపోవడం జరిగితే, జ్యోతిష్యంలో ఇది మీ తల్లికి ఆరోగ్య సమస్యను సూచిస్తుంది, చతుర్ధం సింహాసనం అయితే, అది విరిగిపోయిందంటే దానికి వ్యయ భావమైన మూడవ భావాన్ని చెడుగా తెలియజేస్తుంది.
దీని ప్రభావం వలన 4వ భావం (తల్లి) ఆరోగ్యంలో సమస్యలు లేక అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఉదాహరణ 4
మీరు ఒక దుకాణానికి వెళ్లి ఒక కూల్ డ్రింక్ కొనుక్కుంటే మీరు కొంత డబ్బు చెల్లించి ఆ వస్తువును తీసుకోవాల్సి ఉంటుంది.
దీనిలో భావ విశ్లేషణ చేస్తే, మీరు ఐదవ స్థానంలో డబ్బులిని చెల్లిస్తే, 11వ స్థానంలో ఆ కూల్ డ్రింక్ మీకు లాభంగా మీ చేతిలో ఉంటుంది.
ఇదే 11వ స్థానము దుకాణదారుడు జాతకంలో ఐదవ స్థానం అవుతుంది, అతను కూల్డ్రింకును కోల్పోయి, మన 5లో పోయిన ధనాన్ని, తన 11వ స్థానమైన లాభంగా పొందుతాడు.
ఈ ఉదాహరణ ఎవరు ఏ విషయాన్ని పొందడానికి, లేదా ఇవ్వడానికి మన జీవితంలో రుణానుబంధాన్ని కలిగి ఉన్నారని తెలియజేస్తుంది.
ఇలాంటి ఉదాహరణల సాయంతో మీరు గొప్ప సందర్భాలను పరిష్కరిస్తారని, పరిశీలించగలుగుతారని ఆశిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
ముగింపు :
ఒక గ్రహం ఏ భావం పై ఎంత ఆధిక్యతను పొంది ఉన్నది తెలిసినప్పుడు సునాయాసంగా ఫలితాలు చెప్పగలుగుతాం.
రాశ్యాఅధిపతి కేవలం 25 శాతం బలాన్ని మాత్రమే కలిగి ఉంటారు, రాశ్యాఅధిపతి యొక్క రాశుల్లో ఏ గ్రహాలు లేకపోవడం, రాశ్యాఅధిపతి నక్షత్రాల్లో ఏ గ్రహము లేకపోతే ఆ భావాధిపతి, దాని నక్షత్రాధిపతి కలిసి దాదాపు 75 శాతం ఫలితాన్ని ఇస్తారు, ఆ భావ కారకుడు 25 శాతం ఫలితాన్ని ఇస్తారు.
అలాగే ఒక గ్రహం ఒకే భావానికి కాకుండా అనేక భావాలకు కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాలలో అనుకూల ఫలితాన్ని ఇచ్చి మరి కొన్ని విషయాలలో అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. ఉదాహరణకు అదే గ్రహం ఉద్యోగ విషయంలో అనుకూలాన్ని ఇచ్చి, వివాహంలో అనుకూలత ఇవ్వకపోవచ్చు. ఇలా మనల్ని ఆశ్చర్యం చేసే విషయాలు బోలెడుంటాయి, అనుభవంతో మనకు అవగాహన వచ్చేస్తుందిలే.
ఈ విషయంపై పూర్తి అవగాహనను ముందు వచ్చే వ్యాసాలలో తెలియజేస్తాను.